పోడు సాగుదారులందరికీ పట్టాలివ్వాల్సిందే..

– గిరిజన సమస్యలపై పోరాటాలు ఉదృతం
– టీఏటీఎస్‌

నవతెలంగాణ-కారేపల్లి
పొట్టకూటికోసం పోడు సాగుచేస్తున్న పేదలందరికీ హక్కు పత్రాలివ్వాల్సిందేనని ఆదివాసి గిరిజన సఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీఏజీఎస్‌ ఖమ్మం జిల్లా మహాసభల ప్రచారాన్ని మాణిక్యారం, ఎర్రబోడు, పాటిమీదిగుంపు, ఒడ్డుగూడెం గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వజ్జా రామారావు మాట్లాడుతూ పోడు భూముల సాగు చేస్తున్న వారికి హక్కు కల్పనకు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అనుసరించి గ్రామసభలో తీర్మానం చేసిన ప్రతి ఒక్కరికి పోడుపై హక్కు దక్కాలన్నారు. జిల్లా విభజన సమయంలో ఖమ్మం జిల్లాలో ప్రత్యేక ఐటీడీఏ ఏర్పాటు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని దానిని వెంటనే అమలు చేసి ఖమ్మం జిల్లా గిరిజనులకు ఐడీటీఏ ఫలాలు అందేలా చూడాలని కోరారు. ఆదివాసీ గిరిజనులకు ఏజన్సీ సర్టిఫికెట్ల జారీలో ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జూన్‌ 1వ తేదిన కామేపల్లి మండలం కొత్తలింగాల క్రాస్‌రోడ్‌ ధనలక్ష్మిపంక్షన్‌ హాల్‌ లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా 3వ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో టీఏడీఎస్‌ నాయకులు కరపటి సీతారాములు, కుర్సం శ్రీను, పూనెం బాబు, వజ్జా శేఖర్‌, కరపటి లక్ష్మయ్య, సూరబాక రాములు, కరపటి రాంబాయి. ఎరిపోతు భద్రయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love