నిగ్గు తేల్చాలి…

నిగ్గు తేల్చాలి...అన్నం ఉడికిందా, లేదా? అని తెలియడానికి ఒక్క మెతుకు పట్టుకుంటే తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి చూస్తే గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో నిర్మితమైన ప్రాజెక్టుల బాగోతం బయటపడుతుంది. వచ్చే వర్షాకాలాన్ని తట్టుకోలేదని జాతీయ డ్యామ్‌ భద్రతా అథారిటి(ఎన్‌డీఎస్‌ఏ) స్పష్టం చేసింది. అవినీతి, అవకతవకలు జరిగాయని విజిలెన్స్‌ ఇప్పటికే చేప్పేసింది. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని ఖర్చుచేసి కేసీఆర్‌ సర్కారు కట్టిన ప్రాజెక్టు పేకమేడ కావడం ఆశ్చర్యం, ఆందోళనకు గురిచేస్తున్నది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నయా తెలంగాణకు దిష్టిబొమ్మలుగా మిగిలిపోనున్నాయా? లేక రూ.8 వేల కోట్లతో ప్రాణహితకు మేడిగడ్డ వద్దే మళ్లీ పాత పథకానికి శ్రీకారం చుడతారా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఒక విధానం నిర్ణయం తీసుకుంటేగాని స్పష్టత రాదు.
వచ్చే వానాకాలం వరదలకు మేడిగడ్డ బ్యారేజీ నిలబడుతుందనే గ్యారంటీ లేదనీ, గేట్లు తెరిచే ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ పేర్కొన్నది. దీంతో అవినీతి, అవకతవకల స్థాయి ఏపాటిదో ఇట్టే అర్థమవుతున్నది. బ్యారేజీ రేడియల్‌ గేట్లలో రెండు పూర్తిగా తెరుచుకునే అవకాశం లేదు. సిమెంటు కాంక్రీట్‌(సీసీ) బ్లాకులు తీసేసి మళ్లీ కొత్తగా అమ ర్చాల్సి ఉంది. ఆప్రాన్‌, గ్రౌటింగ్‌ తదితర పునరుద్ధరణ పనులతోపాటు ఇసుక మేటలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వరద నీటిని సజావుగా సాగేలా చూడాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. కానీ, పరిస్థితి చేయిదాటిపోయి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మరో రెండు,మూడు రోజులూ పడే అవకాశమూ ఉంది. అటు గోదావరి, ఇటు ప్రాణహితకు వరదలు భారీగానే ఉంటాయని ఎన్‌డీఎస్‌ఏ సైతం చెప్పింది. ఇంత స్వల్ప సమయంలో మరమ్మతులు చేయడం సాధ్యమా? సాగునీటి పారుదల శాఖ యుద్ధ ప్రాతిపదికన చేయించగలదా? చేస్తే పాత కాంట్రాక్టర్‌తో చేయిస్తారా ? లేక సర్కారు మరోసారి ప్రజాధనాన్ని అప్పనంగా కుమ్మరించాలా? అనే అనుమానాలు, ప్రశ్నలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి.
2019నుంచే మేడిగడ్డకు నష్టం వాటిల్లిడం ప్రారంభమైందని నివేదిక పేర్కొన్నది. నదులకే నడక నేర్పా మంటూ జబ్బలు చరుచుకున్న కేసీఆర్‌ సర్కారు, ఇప్పుడు ఏమని సమాధానం చెబుతుంది? కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) ప్రకారం కాళేశ్వరానికి రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకా రూ.45 వేల కోట్లు సర్దితేగాని ప్రాజెక్టు పూర్తికాదని చెప్పింది. ఇప్పుడీ పగుళ్లు, బుంగలతో అనుకోని ఉపద్రవం ముందుకొచ్చింది. అనధికారిక అంచనా ప్రకారం మరో రూ. 20 వేల నుంచి రూ. 25 వేల కోట్లు మరమ్మతుల కోసం ఈ ప్రాజెక్టుకు అవసరపడ తాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ నిధులతో ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిగా చేపట్ట వచ్చని ఐదునెలల రేవంత్‌ సర్కారు తొలి నుంచి అంటూనే ఉంది. రూ.లక్షల కోట్లు వ్యయం చేసి కట్టిన ప్రాజెక్టులు గాలివాటానికి కొట్టుకుపోతుంటే గుడ్లప్పగించి చూడాల్సిన పనిలేదు.
శరవేగంగా, న్యాయబద్దంగా ఆయా కమిటీలు, జ్యూడిషియల్‌ విచారణ నివేదికలు తెప్పించుకుని అక్ర మార్కుల భరతం పట్టాలి. అంతుతేల్చాలి, ఆటకట్టించాలి. ప్రాజెక్టు డిజైన్లు, ప్రణాళికల దగ్గర నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అధికారగణం, పాలకుల అడుగులకు మడుగులొత్తి తెలంగాణకు కడుపుకోతను మిగిల్చారు. ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్టు బీఆర్‌ఎస్‌ సర్కారు పాపంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుకూ భాగముంది. ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చేక్రమంలో డీపీఆర్‌ను సరిగ్గా పరిశీలించ లేదు. క్షేత్రస్థాయి సందర్శన అసలే లేదు. తీరా బ్యారేజీలో పగుళ్లు, బుంగలు బయటపడ్డాక గగ్గోలు పెడుతున్నదా పార్టీ. సరైన సమాచారం ఇవ్వలేదంటూ నోరుపారేసు కుంటున్నది. అందులో సీడబ్ల్యూసీ, ఎన్‌డీఎస్‌ఏతో పాటు నదుల అనుసంధాన సంస్థకు చైర్మెన్‌గా ఉంటూ బీజేపీకి కొమ్ముకాస్తున్న వ్యక్తి ఒకరు.
తెలంగాణ పట్ల, రాష్ట్రానికి ఇచ్చే నిధుల పట్ల పదేండ్లుగా మోడీ సర్కారు చూపుతున్న వివక్ష అంతా ఇంతాకాదు. చివరకు కాళేశ్వరం, మిషన్‌ భగీరథకు నిధులివ్వా లంటూ నిటి ఆయోగ్‌ సిఫారసు చేసినా, మోడీ సర్కారు పెడచెవిన పెట్టింది. అయినా అలరు, బలరు చేసుకుంటూ తొమ్మిదేండ్లు సహావా సం చేసిన కేసీఆర్‌ చివర్లో మేల్కొంటే ఎలా? మతోన్మాద పిశాచిని నెత్తినెక్కించు కుని దొంగ దొస్తానా చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. తాజా ఎన్నికల బస్సుయాత్రలో మొత్తుకుంటే ఎవరికి ప్రయోజనం? కాళేశ్వరం అవకతవకలను సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకిని చంద్రఘోష్‌ నేతృత్వంలోని జ్యూడిషియల్‌ కమిషన్‌ నిగ్గు తేల్చేనా?

Spread the love