అవసరమైన మేరకు ఐటీడీఏలను ఏర్పాటు చేయాలి

 As needed ITDAs should be established– ఆదివాసీల పోడు సమస్యలు తీర్చండి : మండలిలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో అవసరమున్న మేరకు మరిన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.రాష్ట్రంలో గిరిజన సంక్షేమం -పోడు భూముల పట్టాల పంపిణీ అనే అంశంపై శనివారం శాసనమం డలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 33కు పెంచినా ఐటీడీఏలు ఇప్పటికీ మూడుకే పరిమితమయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో అవసరం మేరకు ఐటీడీఏల సంఖ్యను మరిన్ని పెంచాలని సూచించారు. మంచిర్యాల జిల్లా మండలం దండేపల్లి మండలం బోయ పోచగూడెం ఆదివాసులు పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారికి పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అదే విధంగా యెన్నెల, వేమనపల్లి, చెన్నూరు, జన్నారం తదితర ప్రాంతాల్లో సర్వే చేయలేదని తెలిపారు. వారి సమస్యలను తీర్చాలని కోరారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న క్రమంలో వారిపై నమోదైన కేసులున్నింటినీ తొలగిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పూర్తిగా నెరవేరలేదని గుర్తుచ్ఱేశారు. పోడు, ఇతర భూములకు సంబంధించిన కేసుల విషయంలో గిరిజనులు వాదించుకోలేకపోతున్నారనీ, వారి పక్షాన ప్రభుత్వమే న్యాయవాదులను ఏర్పాటు చేసి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అనేక మంది చదువుకుంటున్నారనీ, దీనికి సంబంధించి గతంలో జీవో నెంబర్‌ 3 ఉండేదని నర్సిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయా పాఠశాలల్లో ఎక్కువగా గిరిజనులే ఉపాధ్యాయులుగా ఉన్నారని తెలిపారు. ఉదయం పాఠం చెప్పిన ఉపాధ్యాయులే రాత్రి కాపలా కాయాల్సి వస్తున్నదని వివరించారు. అందువల్ల ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి పోస్టులను మంజూరు చేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు.
మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం…
పోడు భూముల సర్వే చేపట్టి ఏడాదైందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. నర్సిరెడ్డి లేవనెత్తిన అంశాలపై ఆమె మాట్లాడుతూ, అధికారులు ఊర్లకు వెళ్లకుండా ఉండరని అన్నారు. ఒక వేళ అలాంటి సమస్య ఏదైనా ఉంటే తనకు గానీ లేదా తమ శాఖ కార్యదర్శి దృష్టికి గానీ తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసులకు సంబంధించి ఢిఎఫ్‌ఓ పరిధిలో ఉన్నవాటిని ఉపసంహరించుకున్నట్టు తెలిపారు. ఐదు వేలకు పైగా కేసులు న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని వివరించారు. వీటిని పరిష్కరించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్‌, డీజీపీ, అటవీశాఖ అధికారులను ఆదేశించారని ఆమె తెలిపారు.

Spread the love