విభజించి… పాలించి ఓట్లు దండుకునే యత్నొం బ్రిటీష్‌ వాళ్లు చెప్పిందే పాటిస్తున్న బీజేపీ

BJP is following what the British told them to divide and rule and win votes–  ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మణిపూర్‌లో హింస : మండలిలో బీఆర్‌ఎస్‌ సభ్యురాలు కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మణిపూర్‌లో రెండు తెగల మధ్య చిచ్చు పెట్టటం ద్వారా వారిని విభజించు పాలించు అన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా ఓట్లును దండుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. బ్రిటీష్‌ వాళ్లు మొదలుపెట్టిన విభజించు పాలించు సిద్ధాంతాన్ని బీజేపీ పాటిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అక్కడ హింస చెలరేగుతున్నదని చెప్పారు. అక్కడ చోటుచేసుకున్న ఘటనలు దారుణమని పేర్కొంటూ ఆ పరిణామాలను తీవ్రంగా ఖండించారు. శనివారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో గిరిజన సంక్షేమం-పోడు భూములకు పట్టాల పంపిణీ’అనే అంశంపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నిలబడి చూస్తున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఇది చాలా దారుణమనీ, అందరూ దీన్ని ఖండించాలని కోరారు. అన్ని జాతులూ బాగుపడాలని బీఆర్‌ఎస్‌ కోరుకుంటుంటే విభజించి పాలించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలోని బీజేపీ చేస్తోందని అన్నారు. కానీ ఐక్యతే తమ పార్టీ సిద్ధాంతమని ఆమె స్పష్టం చేశారు. గిరిజనుల సంక్షేమానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని వివరించారు. అటవీ హక్కుల చట్టాన్ని కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. అడవుల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో 1.50 లక్షల మందికి 4.05 లక్షల ఎకరాల అటవీ భూములకు సీఎం కేసీఆర్‌ పట్టాలిచ్చారని వివరించారు. వారికి రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయని అన్నారు. గ్రామ సభలు తీర్మానం చేసే హక్కును కూడా తొలగిస్తూ అటవీ హక్కుల చట్టానికి సవరణలు చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్రలు పన్నుతున్నదని చెప్పారు. అటవీ హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసిందనీ, పీసా చట్టాన్ని చాలా పేలవంగా అమలు చేస్తున్నదని కాగ్‌ కూడా తేల్చిందని చెప్పారు. గిరిజన సబ్‌ప్లాన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదన్నారు. వివిధ శాఖలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.
ఆదివాసీల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర : గోరటి వెంకన్న
ఆదివాసీల చరిత్రను కనుమరుగు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ సభ్యుడు గోరటి వెంకన్న విమర్శించారు. అడవుల్లో సహజ వనరులను మైనింగ్‌ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఆదివాసీలను వనవాసీలు అనడం కుట్రపూరిత మేనని అన్నారు. వారి సంస్కృతిని ధ్వంసం చేయడం సరైంది కాదన్నారు. మణిపూర్‌లో జరిగిన ఘటనలు బాధాకరమనీ, వాటిని తీవ్రంగా ఖండించారు.
నిరంకుశంగా కేంద్రం తీరు : పల్లా
గిరిజనుల అభివృద్ధి, వారి సంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవమరిస్తున్నదని బీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదనీ, గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం లేదని చెప్పారు. మేడారం జాతరకు కేంద్ర మంత్రులు వస్తున్నా ఒక్క రూపాయి ఇవ్వడం లేదన్నారు. కేంద్రం సహకరించకపోయినా గిరిజన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం పది శాతానికి పెంచి అమలు చేస్తున్నదని వివరించారు.
గిరిజన బంధు ప్రవేశపెట్టాలి : జీవన్‌రెడ్డి
ఉమ్మడి ఏపీలో 3.08 లక్షలు, తెలంగాణ వచ్చాక 4.05 లక్షలు కలిపి మొత్తం ఏడు లక్షల ఎకరాల పోడు భూములను గిరిజనులకు పంచారని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి చెప్పారు. వర్షాధారంగా పంటలు పండిస్తున్నారని అన్నారు. అయితే సాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తే మరిన్ని పంటలు పండుతాయని సూచించారు. సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి గిరిజన బంధును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గిరిజన తండాల గ్రామపంచాయతీలకు రూ.పది లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నోటిఫికేషన్లు విడుదలయ్యాక గిరిజనుల రిజర్వేషన్లను పదిశాతానికి ప్రభుత్వం పెంచిందన్నారు. న్యాయ సలహా తీసుకుని ఆ నోటిఫికేషన్‌కూ పెంచిన రిజర్వేషన్లను వర్తింపచేయాలని సూచించారు. మణిపూర్‌ ఘటన దారుణమని విమర్శించారు. అక్కడ గిరిజన తెగలు, ఆడబిడ్డలపై జరుగుతున్న దాడి, హింసను వ్యతిరేకిస్తూ శాసనమండలి తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాలని కోరారు.

Spread the love