బదిలీలు, పదోన్నతులపై సీఎం జోక్యం చేసుకోవాలి

– హైకోర్టు స్టే ఎత్తేసేందుకు చర్యలు చేపట్టాలి
– ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
– నిరసన దీక్షలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్‌
– పలు ఉపాధ్యాయ సంఘాల సంఘీభావం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్‌ చేశారు. హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. జూన్‌ 12లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ఆయన దీక్ష చేపట్టారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చేపట్టిన ఈ దీక్షకు పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలువురు ఉపాధ్యాయులు, అధ్యాపకులు సంఘీభావం ప్రక్రటించారు. ఈ సందర్భంగా నర్సిరెడ్డి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరమైనా పాఠశాల విద్య ఉత్తేజంగా ఉన్నతంగా ముందుకు పోతుందని భావించామని చెప్పారు. కానీ ప్రకటించిన బదిలీలు, పదోన్న తుల షెడ్యూల్‌ హైకోర్టు స్టే వల్ల ఆగిపోయిందన్నారు. ఇది చాలా విచారాన్ని కలిగించిందని అన్నారు. షెడ్యూల్‌ ప్రకటించిన అధికారులు వెంటనే అవస రమైన చర్యలు తీసుకుని బదిలీలు, పదోన్నతులపై స్టేను ఎత్తేసేందుకు ప్రయత్నించి పూర్తి చేయాలని కోరారు. కానీ తాత్సారం చేస్తున్నారని విమ ర్శించారు. దానికి నిరసనగానే దీక్ష చేపట్టానని వివరించారు. రాష్ట్ర ప్రభు త్వం తక్షణమే చర్యలు తీసుకుని హైకోర్టులో ఉన్న స్టేను ఎత్తేయించాలని డిమాండ్‌ చేశారు. మోడల్‌ స్కూళ్లు ఏర్పాటై పదేండ్లవుతున్నదని చెప్పారు. ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఉన్నారని అన్నారు. సగానికి ఎక్కువ ప్రిన్సిపాల్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను పూర్తి చేయాలని కోరారు. ఒక ఉపాధ్యాయుడు లేదా ఉద్యోగి దశాబ్దానికిపైగా ఒకే దగ్గర పనిచేస్తే స్తబ్ధత వస్తుందన్నారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎస్సైలను మూడేండ్లకే బదిలీ చేస్తారని గుర్తు చేశారు. బదిలీలు, పదోన్నతులు బడులు బాగుపడేందుకేనని అన్నారు. ఇది పాఠశాల విద్య అభివృద్ధి చెందడానికే ఉపయోగపడుతుందని, ఉపాధ్యా యుల సమస్య మాత్రమే కాదని వివరించారు. పీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌ మెంట్‌ బిల్లులు, జీతం ప్రతినెలా ఒకటో తేదీన రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, గెస్ట్‌ లెక్చరర్లకైతే ఐదారునెలలుగా జీతాలు పెండింగ్‌ లో ఉంటున్నాయని అన్నారు. ఎయిడెడ్‌ టీచర్లకు మార్చి, ఏప్రిల్‌ జీతాలు ఇంకా రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీతాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఒకటో తేదీన జీతాలను చెల్లించాలని కోరారు. ఈ- కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఈనెల 31లోగా చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు. 475 కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, సమగ్ర శిక్షలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస వేతనాల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి మినిమం బేసిక్‌ పే ఇవ్వాలని కోరారు. కేజీబీవీల్లో కేర్‌టేకర్‌ ను నియమిస్తే నైట్‌డ్యూటీలుండబోవని స్పష్టం చేశారు. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, వచ్చే విద్యాసంవత్సరమైనా ఉత్తేజంగా, ఉన్నతంగా, ఉత్సాహంగా ముందుకెళ్లేందుకు తోడ్పడాలని ఆకాంక్షించారు.
విద్యారంగంపై నిర్లక్ష్యం తగదు : ఉపాధ్యాయ సంఘాల నేతలు
విద్యారంగంపై నిర్లక్ష్యం తగదని ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి చేపట్టిన నిరసన దీక్ష శిబి రాన్ని సందర్శించి వారు సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతుల ప్రక్రియను ఈ సెలవుల్లోనే విద్యాశాఖ చర్యలు చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్‌ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, నాయకులు పి మాణిక్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, డీటీఎఫ్‌ ప్రధాన కార్య దర్శి టి లింగారెడ్డి, తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్ల సంఘం అధ్యక్షులు పి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, ఎంఎస్‌టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి మహేశ్‌, తెలంగాణ పౌర స్పందన వేదిక నాయకులు రవికుమార్‌, సురేష్‌, ఎంఎకె దత్తు, మస్తాన్‌రావు, బీటీఎఫ్‌ నాయకులు యాదగిరి, సీఐటీయూ నాయకులు ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టకపోయినా, ఖాళీ పోస్టులు భర్తీ చేయక పోయినా ప్రభుత్వ విద్యారంగం ఉనికి కోల్పోయే ప్రమాదముందన్నారు. ఆ రంగాన్ని కాపాడుకునేందుకు సంఘాలన్నీ ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

Spread the love