వ్యక్తులు కాదు..వ్యవస్థ ముఖ్యం

– గడప ముందే సమస్యల పరిష్కారం
– దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాల ఏర్పాటు
– ఒకే రోజు 132 డివిజన్లలో ప్రారంభం
– వార్డు పాలనతో జవాబుదారీతనం
– భవిష్యత్తులో ఇతర శాఖల అధికారులను కూడా అనుసంధానం చేస్తాం
– కాచిగూడ వార్డు ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో/అంబర్‌పేట్‌
”ఏ సమస్య వచ్చినా సర్కిల్‌ స్థాయివరకు వెళ్లకుండా ఇక్కడే పరిష్కారం అయ్యేవిధంగా వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశాం.. వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలి.. వార్డు కార్యాలయాల పాలనతో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి” అని మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. కాచిగూడ డివిజన్‌లో వార్డు కార్యాలయాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వార్డు కార్యాలయాల పాలనతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారం కావడంతోపాటు స్థానిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మెరుగైన పాలనతో అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నా, అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వల్ల ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4 కోట్లకుపైగా జనాభాగా ఉండగా.. నగరంలో కోటికిపైగా జనాభా ఉందని, అయితే జీహెచ్‌ఎంసీ 30 సర్కిళ్లలో 35వేల మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. స్ధానిక ప్రజా ప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వార్డు కార్యాలయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించేలా ఈ వ్యవస్థను రూపొందించినట్టు తెలిపారు. ఇక్కడ విజయవంతం అయితే దేశం మొత్తం ఈ వ్యవస్థను అన్ని నగరాల్లో అమలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వార్డు కార్యాలయాల్లో ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలన్నారు. సత్వరం వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు.
వార్డు వ్యవస్థ కొత్తది అయినందున కొద్ది రోజులపాటు కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత వేగంగా ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసేలా కృషి చేస్తామన్నారు. వార్డు కార్యాలయానికి అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ స్థాయి అధికారి ఇన్‌చార్జీగా ఉంటారని, ఈ ఆఫీసుకు మొత్తం పదిమంది అధికారుల బృందం వివిధ శాఖల నుంచి పనిచేస్తారని వివరించారు. రోడ్డు నిర్వహణ, పారిశుధ్యం, ఎంటమాలజీ, హరితహారం, టౌన్‌ ప్లానింగ్‌, విద్యుత్‌ శాఖ, జలమండలి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇలా పదిమంది అధికారులు వార్డు స్థాయిలో జరిగే ఆయా శాఖల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. భవిష్యత్తులో ఆరోగ్య శాఖ, పోలీస్‌ శాఖ తరపున కూడా వార్డు కార్యాలయానికి అనుసంధానం చేస్తామని మంత్రి వెల్లడించారు.
కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. 150 వార్డులకుగాను 132 వార్డులను ప్రారంభించామని, మిగతా 18 వార్డులను వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మున్సిపల్‌, రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్‌, విద్యుత్‌ వ్యవస్థలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రజల నుంచి అధికంగా వచ్చే అవకాశాలున్నాయన్నారు. వైద్య, ఆరోగ్య, పోలీస్‌ శాఖకు సంబంధించిన అధికారులను కూడా వార్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని మంత్రిని కోరారు. వార్డు కార్యాలయంలో మున్సిపాల్టీకి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర శాఖల సమస్యలను కూడా స్వీకరించి సంబంధించిన శాఖకు తెలియజేయడం జరుగుతుందన్నారు. జలమండలి ఏండీ దాన కిషోర్‌ మాట్లాడుతూ.. కాచిగూడ వార్డులో 50 వేల జనాభా ఉంటే 5200 నల్లా కనెక్షన్లు ఉన్నాయన్నారు. తాగు నీరు నిర్దేశించిన సమయం ప్రకారం సప్లరు చేస్తున్నప్పటికీ, కొన్నిసార్లులో ప్రెషర్‌, సివరేజీ సమస్య వస్తుందన్నారు. వీటిపై వార్డు కార్యాలయం సిబ్బంది అప్రమత్తతో అప్పటికప్పుడే పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్‌, కార్పొరేటర్లు ఉమా రమేష్‌ యాదవ్‌, దూసరి లావణ్యా శ్రీనివాస్‌గౌడ్‌, విజయకుమార్‌ గౌడ్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, యూబీడీ అడిషనల్‌ కమిషనర్‌, వి.కృష్ణ, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీి వేణుగోపాల్‌, నాయకులు డాక్టర్‌ శిరిషా ఓం ప్రకాష్‌ యాదవ్‌, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Spread the love