గీఐడీపీఎల్‌ సంస్థలో రూ. 1000 కోట్ల స్క్రాప్‌ స్కాం  టీఎస్‌టీఎస్‌ చైర్మెన్‌ పాటిమీది జగన్‌ మోహన్‌రావు సంచలన ఆరోపణలు

నవతెలంగాణ-కూకట్‌పల్లి
ఐడీపీఎల్‌ సంస్థలో రూ.1000 కోట్ల స్క్రాప్‌ స్కాం జరిగిందని టీఎస్‌టీఎస్‌ చైర్మెన్‌ పాటిమీది జగన్‌ మోహన్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఆయన కార్యాలయంలో మాట్లాడారు. ఇండియన్‌ డ్రగ్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ కంపెనీలోని విలువైన యంత్రాలను అంగడి సరుకల్లా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఈ సంస్థ తాళాలు దొంగ చేతికి అప్పగించిన చందంగా ఉందన్నారు. ఇన్‌చార్జి మేనేజర్‌గా పని చేస్తున్న వ్యక్తి పాతబడి పోయిన రూ.1000 కోట్ల విలువ గల యంత్రాలను సుమారు 67 కోట్లకు టెండర్లు పిలిచారన్నారు. దేశంలోనే అతిపెద్ద ఆక్సిజన్‌ ప్లాంట్‌, వందల సంఖ్యలో గ్లాస్‌ ప్రొటెక్ట్‌ కేటెల్స్‌, రియాక్టర్స్‌, పదుల సంఖ్యలో బస్సులు, ట్రక్కులు, ఫైర్‌ ఇంజన్‌లు ,లారీలు, అత్యంత సామర్థ్యంగల మేజర్‌ ఇరిగేషన్‌ పంపులు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలు, లక్షల టన్నుల స్టీలు, బాయిలర్‌లు, వీటిని ఏ కమిటీతో లెక్కించినా వెయ్యి కోట్లకు తక్కువగా ఉండదన్నారు. అలాంటి పబ్లిక్‌ సెక్టార్‌ ప్రాపర్టీని రూ.67 కోట్లకే టెండర్లు వేసి విక్రయిం చారని, ఎక్జిక్యూటివ్‌ పర్సనల్‌ మేనేజర్‌ విజరుకుమార్‌ సహకారంతో టెం డర్లు ఈ విక్రయాలు జరిపించారని ఆరోపణలు చేశారు. విజరు కుమార్‌ బీజేపీ జాతీయ నాయకునికి సమీప బంధువు కావడంతో ఈ స్క్రాప్‌ కుంభకోణం పూర్తిగా ఆయన కనుసన్నల్లోనే జరుగుతోందని తెలిపారు. ఈ విక్రయాన్ని రీకాల్‌ చేయాలని కేంద్ర రసాయనిక శాఖ మంత్రి మనీష్‌ పాండ్యకు రిప్రజెంటేషన్‌ ఇవ్వనున్నామని, పోస్ట్‌ కార్డుల ద్వారా కేంద్ర మంత్రికి తెలియజేయాలని నిర్ణయించామని ఐడీపీఎల్‌ మాజీ ఉద్యోగులు ఈ సందర్భంగా తెలిపారు.

Spread the love