‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్ట్‌

ముంబయి: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌(74)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు శుక్రవారం రాత్రి ముంబైలో అరెస్టు చేశారు. ఆయనను అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ అరెస్టు చేసింది. నరేశ్‌ గోయల్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం కెనరా బ్యాంక్‌ నుంచి 848.86 కోట్ల రుణాలను తీసుకున్నారని, అందులో 538.62 కోట్లను బ్యాంక్‌కి చెల్లించలేదని కెనరా బ్యాంక్‌ ఫిర్యాదు మేరకు గోయల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బ్యాంక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ గోయల్‌ డబ్బుల్ని స్వాహా చేసినట్టు నిర్ధారించింది. ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే ఈడీ గోయల్‌ని ప్రశ్నించి అరెస్టు చేసింది. గోయల్‌ని శనివారం ముంబయిలోని పీఎంఎల్‌ఏ కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఇడి అధికారులు ఆయనను కస్టడీ కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, మోసం, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని పేర్కొంటూ నరేశ్‌ గోయల్‌, అనితా గోయల్‌, గౌరంగ్‌ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్‌ 11న సీబీఐకి కెనరా బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ పీ సంతోష్‌ ఫిర్యాదు చేశారు. దీనివల్ల బ్యాంకుకు రూ.538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు.

Spread the love