– వారు సమాజ హితమే ధ్యేయంగా పని చేయాలి : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జర్నలిజం అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనీ,. చెడును దూరం చేసి సమాజ సంక్షేమం కోసం దీనిని వినియోగించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. మంగళవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన ”జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్” అనే అంశంపై భారత ప్రభుత్వం, ఇండియన్ టెక్నికల్ , ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటీఈసీ) కార్యక్రమం కింద ఈ శిక్షణా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వంలోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్ ఇనిస్టిట్యూట్ ఫిబ్రవరి 26 నుంచి ఆదివారం వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన మీడియా నిపుణులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దేశ పాలనా స్వభావాన్ని, నాణ్యతను నిర్ణయించటంలో జర్నలిజం, ప్రజా సంబంధాల విభాగాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.. ”మీడియా నిపుణులు ప్రజలకు, వివిధ ప్రభుత్వ విభాగాలకు మధ్య వారదిగాó ఉంటూ సమాజహితానికి తోడ్పడాలని సూచించారు. అన్ని రంగాల మాదిరిగానే జర్నలిజం మీడియాలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న మీడియా ముఖచిత్రంలో జర్నలిజం, ప్రజా సంబంధాల కొత్త సాధనాలు, సాంకేతికతను నిరంతరం నేర్చుకోవడం ద్వారా వారి ఉద్యోగాలను సమర్ధవంతంగా నిర్వహించడం జర్నలిస్టులకు చాలా ముఖ్యమైనదన్నారు. ఇదే విషయమై జర్నలిస్టులకు శిక్షణ అవసరమని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో అత్యాధునిక సాంకేతికతలతో మీడియా నిపుణులను సన్నద్ధం చేయడంలో శిక్షణా కార్యక్రమం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ డీజీ, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శశాంక్ గోయెల్, అధ్యక్షత వహించారు.