జర్నలిస్ట్ నవీన్ కుటుంబాన్ని ఆదుకోవాలి

నవతెలంగాణ – పెద్దవంగర
విద్యుదాఘాతంతో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ తాళ్లపల్లి నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, చేయూతనందించాలని సీనియర్ జర్నలిస్టులు సుంకరి ఓంకార్, జాటోత్ దామోదర్ అన్నారు. శుక్రవారం కొరిపల్లి గ్రామంలో నవీన్ కుటుంబాన్ని సీనియర్ జర్నలిస్టులు రంగు లక్ష్మణ్, బారి విక్రమ్, జాటోత్ సుధాకర్, పెద్దవంగర నివాసి సుంకరి మురళీధర్ తో కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నవీన్ అకాల మరణం బాధాకరం అన్నారు. జర్నలిస్ట్ గా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ కారణాలతో రాష్ట్రంలో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఇప్పటివరకు ఆదుకోవడం లేదని గుర్తుచేశారు. నవీన్ కుటుంబానికి వెంటనే రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ తాళ్లపల్లి మల్లేష్, స్థానిక నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love