విన్నాను…
ఆకలైన పేగులలో
దాగిన అలసత్వాన్ని..
పిడికెడు మట్టిలో ఆవిరైన నా మనోవేదనని….
చూస్తున్నాను…
మల్లె మొగ్గ లాంటి నా కనులలో
మెరిసే మెరుపులను
ఏ సంద్య కిరణం కసిగా కోసేసిందని…
అడుగుతున్నాను…
ఈ కాలాన్ని…
నాలుగు చుక్కల కన్నీటితో
కడుపు నింపుకోవడం ఎలా అని…?
వెదుకుతున్నాను….
మనసు మాటున దాగిన మాటలను
ఏ మరు భూమిలో మర్మంగా దాచానని…
ఏరుతున్నాను…
ఎండిపోయిన ఊబిలో
ఎగసి ఎగసి వచ్చే
ఆశల బుడగలని…
దేహిస్తున్నాను….
దౌర్జన్యపు రాజకీయ కుట్రలో
విరిగిన మొక్కల మొండలను…
అమ్ముడు పోయిన ఒట్లెన్ని
కసాయి కత్తులుగా మారాయని…
చేరుతున్నాను…
కనిపించని కీర్తిని చేతపట్టి
నాలుగు భుజాల పై…
రారాజుగా ఊరేగుతూ…
అందరూ కన్నీటి పూలనీ వర్షంగా కురిపిస్తుంటే..
భూతల్లి ఒడిలో సేదతీరుతూ
మట్టి పాలని తాగడానికి..
మరో ప్రపంచానికి పయనమవుతున్నను…..!!
– గోపి.జి, 9052871896