నీ స్నేహం

your friendshipనిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నింపుటకు
నేనున్నాని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యమూ…

స్నేహానికి ఇంతకంటే గొప్ప నిర్వచనం ఇంకేముంటుంది. జీవితం చుట్టూ ఒక గాడాంధకారం అలుముకున్నప్పుడు, నిరాశా నిస్పహలు చుట్టుముట్టినపుడు.. నీ కోసం నేనున్నాను.. అంటూ భుజం తట్టే ఆత్మీయ స్పర్శ స్నేహం. ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఎక్కడో ఒక చోట ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతూనే ఉంటాయి.
స్నేహమంటే ఒక నులివెచ్చటి స్పర్శ. భాషకందని కమ్మటి భావన. చుట్టూ అల్లుకున్న మానవ సంబంధాల పొదరింట్లో విరిసిన అందమైన గులాబీ. జీవితంలో మరిచిపోలేని ఒక మధుర జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు… బుడిబుడి అడుగుల బాల్యంలోనే అల్లుకునే స్నేహ బంధాలు కొన్నయితే… పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరి కొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్‌లోనో, తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకొనే స్నేహం..
ఒక మహావక్షంలా ఎదుగుతుంది. జీవితంతో మమేకమవుతుంది. ఒక విడదీయరాని అనుబంధమై పోతుంది. అసలు కళాశాల అంటేనే స్నేహితుల కలల కాణచి. సహ విద్యార్థిగా రూపుదిద్దుకొనే పరిచయం.. స్నేహమై ఎలా ఎదుగుతుందో, జీవితంలో ఒక తీపి గుర్తుగా ఎలా మిగిలిపోతుందో ఏ డైరీని అడిగినా చెబుతాయి. మదిలో నిక్షిప్తమైన భావాలను, అనుభవాలను, అనుభూతులను పంచుకోవడం తప్ప ఏ స్వార్ధం లేని జీవన బంధం స్నేహం. జీవితంలో ఎవరున్నా, లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలు.
కొందరి ఫ్రెండ్‌ షిప్‌ స్కూల్‌తో ఫుల్‌ స్టాప్‌ పెడతారు. మరికొందరు కాలేజీతో కామా పెడతారు. కానీ స్కూల్‌ నుంచి మొదలై కాలేజీలో కంటిన్యూ అయి జీవితాంతం బ్రహ్మముడిలా విడిపోకుండా అలా పెనవేసుకుంటాయి. స్నేహమంటే స్కూల్‌, కాలేజీ ఇవే కాదు ఒక యజమాని సేవకుడి మధ్యలో కూడా తారతమ్యాలు లేని అరమరికలు లేని స్నేహం అంతస్థులు మరిచి అంతరంగాలను పంచుకుంటుంది. స్నేహానికి కులం లేదు. మతం అడ్డురాదు. అది చంద్రుని వెన్నెల లాంటిది. వీచే చిరుగాలి వంటిది. జలజలా రాలే సెలయేటి లాంటిది అవును అన్ని మతాలకు దోస్తీ సమ్మతమే. ఓ నిముషం కోపంగా మరునిముషం నవ్వులతో.. మరి కాసేపు ఈర్ష్యతో.. ఇంకాసేపు – అనురాగంతో.. జీవితంలో కురిసే రసాలన్నిటినీ రుచిచూపించేదే స్నేహం. అది భవిష్యత్తును కలలు కంటుంది. వర్తమానంలో కలహించుకుంటుంది. గతాన్ని గుర్తుచేసుకొని కంటతడి పెడుతుంది. స్నేహానికి ఉన్న విలువను కాపాడుకొని.. అసూయలను పాతరేసి.. ఈర్ష్యలను వదిలేసి.. కమ్మనైన కలలు కనే మంచి తోడు ప్రతి ఒక్కరికి దొరుకుతారు. ఆ తోడును జీవితాంతం నిలుపుకునే అదష్టం ఉంటే అదే అమత స్నేహం.
స్నేహానికున్న విలువ వెలకట్టలేనిది. ఈ లోకంలో స్నేహితుడు/ స్నేహితురాలు లేకుండా ఏ వ్యక్తి వుండరు. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పటైనదే స్నేహితుల రోజు. స్నేహితుల రోజును ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.
1935లో అమెరికా కాంగ్రెస్‌ ”ఫ్రెండ్‌షిప్‌డే”ను ప్రకటించింది. స్నేహ మాధుర్యాన్ని చవిచూసిన ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయంతో ఏకీభవించారు. ఫలితంగా ప్రపంచంలో నేడు అనేక దేశాలు స్నేహితుల రోజును జరుపుకుంటున్నాయి. ప్రతి ఏటా తమ తమ మిత్రులకు సంప్రదాయ బద్దంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వుంటారు మిత్రులు. సుదూర ప్రాంతాలలో వున్న మిత్రులందరూ ఒకచోట చేరి స్నేహితుల రోజున కలిసి విందులు, వినోదాలలో పాల్గొనడం జరుగుతోంది. అయితే ఈ స్నేహుతుల రోజులలోనూ రకాలున్నాయి. అవేంటంటే…
జాతీయ స్నేహితుల రోజు ఆగస్టులో వచ్చే మొదటి ఆదివారం జరుపుకుంటారు. అలాగే మహిళా స్నేహితుల రోజును ఆగస్టు మూడో ఆదివారం సెలబ్రేట్‌ చేసుకుంటారు. అదే విధంగా అంతర్జాతీయ స్నేహితుల నెలగా ఫిబ్రవరి మాసాన్ని పరిగణించారు. ఇక పాత స్నేహితులు, కొత్త స్నేహితుల వారాన్ని మే మూడో వారంలో జరుపుకుంటారు. ఇలా ఎన్ని వర్గాలుగా విభజించినా స్నేహితుడు… ఎప్పుడు హితుడే కదా…
”నా ముందు నడవద్దు, నేను అనుసరించకపోవచ్చు. నా వెనుక నడవద్దు, నేను ముందుకు నడవలేక పోవచ్చు.
నాతోపాటు నడువు.. నా స్నేహితుడిగా ఉండు చాలు..”
స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం… అన్నాడో సినీకవి. జగత్తులో ఎన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నా స్నేహబంధం అనేది మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. మిగిలిన అన్ని బంధాలు ఏదో రూపంలో మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో ప్రవేశిస్తాయి. కానీ స్నేహబంధం మాత్రం పూర్తిగా మన ఇష్టంతో, మనకు నచ్చిన వారితోనే ఏర్పడుతుంది. స్నేహితుల పట్ల విజ్ఞతతో వ్యవహరించడం చాలా అవసరం. సమయ సందర్భాలను బట్టి మాత్రమే స్పందించాలి. స్నేహితుని లోపాలను ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా, అతని మేలుకోరి సున్నితంగా తెలియజెప్పాలి. నేడు స్నేహం కూడా కత్రిమమై పోయింది. మొహమాటపు స్నేహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనసు లోతుల నుంచి పెల్లుబికే స్నేహ సంబంధాలు చాలా అరుదు. స్నేహం ముసుగులో మోసం, దగా, వంచన కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
అలాంటి ఆశయాలకు బాటలు వేసిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మార్క్స్‌ ఏంగెల్స్‌, చేగవేరా ఫెడల్‌ క్యాస్ట్రో.. కారల్‌ మార్క్స్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఏంగెల్స్‌ మైత్రీబంధం నేటికీ ప్రపంచానికి ఆదర్శం. నేడు స్నేహితుల దినోత్సవం. హ్యాపీ ఫ్రెండ్షిప్‌ డే…
– ఎం.కె.

Spread the love