ఇకనైనా నిద్ర లేవండి !

Wake up soon!ఉమ్మడిగున్నప్పుడు
ఉధతంగ..
దోపిడి గురించి మాట్లాడినం !

అభివద్ధికి
ఆటంకం జరిగిందని
అక్రమాల్ని విపులీకరించి
నిరసనలు సేపట్టినం !

ఏష బాసలు
పల్సబడుతున్నయని
సిరుతల రామన్నెమాడినం !

విముక్తి నేపథ్యంలో
ఉరికురికి..
ఉద్యమానికి ఊపిరులూదినం !

మూలాల్ని తుంగలోతొక్కి
ఆకాంక్షల్ని..
ఏకపక్షంగ గాలికొదిలినప్పుడు
కనీసం ధిక్కరించెటోడు లేడు !

నిరంకుశంగ
గొంతులకు గొంతులు నులిమితే
ఎలుగెత్తి గిదెట్లని
ప్రశ్నించెటోడు ఒక్కడు రాడు !

దర్నాలు, నిరసనలు
ఈ మట్టిమీద దేశద్రోహమైతే
ఈ ఉద్యమనేల చరిత్రేమిటో.. !

ఎంతటి నియంతైనా..
తవ్వెడు తీసుకున్నకాడ
తంగెళ్ళుపీకుమంటె పీకాలె!
ఫ్లెక్సీలకు పాలాభిషేకాలెందుకు!?

సెరువుల బర్లనుతోలి
కొమ్ములకు బారెం పెట్టినంక
ఇప్పుడు కుములుతే ఏం లాభం !?

ప్రత్యేక పోరాటంలనే కాదు
తుది ఫలితంల కూడ
సజనకారులకు భాగం ఉంటది !

ఎన్ని నిందలు మోపినా
తుపాకి తూటాలు దించినా
కలాలు, గలాలు..
చైతన్యక్రియ మరువద్దు కదా !

రానున్నది..
ఎన్నికల కోలా’హాలాహలం’
ఇక నటించింది చాలు
కవిగాయకులారా !
ఇకనైనా మొద్దు నిద్ర వదలండి !!

– అశోక్‌ అవారి, 9000576581

Spread the love