మనసు నొప్పించకుండా…

Without heartache...అప్పటి వరకు అమ్మా నాన్న వెంటే తిరిగిన పిల్లలు… టీనేజ్‌ వచ్చాక స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. దాంతో తల్లిదండ్రులకు తమ మాట వినట్లేదని ఒకింత బాధగానే ఉంటుంది. తమని పట్టించుకోవట్లేదనీ ఫీలవుతుంటారు. ఆంక్షలు విధిస్తుంటారు. టీనేజ్‌ పిల్లలున్న ప్రతి ఇంట్లో ఈ పరిస్థితులు సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే పిల్లలు నొచ్చుకోకుండా వారి మనసు మారాలంటే ఇలా చేసి చూడండి…
అభినందించడం
ఎదిగిన పిల్లలు మీ చెప్పుచేతుల్లో ఒదిగి ఉండాలని అనుకోవడం సరికాదు. ‘మీకేం తెలుసు’ అని తీసిపడేసినట్టుగా చూస్తే పిల్లల్లో పౌరుషం పొడుచుకొస్తుంది. టీనేజ్‌ వయసులో పిల్లలు స్వతంత్రంగా వ్యవహరించాలని భావిస్తుంటారు. వారి ఎదిగే వయసును గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మీ ఇంటి చర్చల్లో వారిని భాగస్వాములను చేయండి. వారిచ్చే సలహాలు పూర్తిగా వినండి. అవి మంచివైతే అభినందించండి. ‘నీకెందుకు నువ్వెళ్లి చదువుకో.. మేం చూసుకుంటా’ అని అంటే నొచ్చుకుంటారు. ఇదే మాట ప్రతి సారీ అంటుంటే ‘నా మాటకు విలువ ఇవ్వనప్పుడు.. మీ మాట నేనెందుకు వింటాను’ అని పిల్లలు మిమ్మల్ని ఎదిరించవచ్చు.
కలివిడిగా ఉండండి
కాలేజ్‌ వయసులో పిల్లలకు స్వేచ్ఛనిస్తే వారెక్కడ దారి తప్పుతారో అని కాస్త కట్టుదిట్టం చేస్తుంటారు. ఇది సరికాదు. అయితే పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం, ఎక్కవ ఆంక్షలు విధించడం రెండూ కరెక్ట్‌ కాదు. ఈ రెండూ పిల్లల మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. స్వేచ్ఛకు కొన్ని పరిమితులు ఉంటాయని వారు అర్థం చేసుకునేలా చెప్పండి. వారికంటూ ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించండి. ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకురమ్మనండి. వారి స్నేహితులతో మీరూ కలివిడిగా ఉండటానికి ప్రయత్నించండి. మీ అనుభవంతో ఆ ఫ్రెండ్స్‌ ఎలాంటి వారో ఇట్టే తెలిసిపోతుంది. చెడుసావాసం చేస్తున్నట్టు అనిపిస్తే అలాంటి వారితో స్నేహం అంత మంచిది కాదని హితవు పలకండి. మొదట్లో అర్థం చేసుకోకపోవచ్చు. కానీ నెమ్మదిగా మీ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించగలుగుతారు.
ప్రోత్సహించండి
పిల్లలను ఇతరులతో పోల్చకండి. ఇతరులు సాధించిన విజయాలను మీ పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా చెప్పడంలో తప్పులేదు. కానీ మీ పిల్లలను వారితో పోల్చడం మంచిది కాదు. ఈ పద్ధతి ఎక్కువ కాలం కొనసాగితే కొన్నాళ్లకు కొరకరాని కొయ్యల్లా తయారవుతారు. ఎదుటివారి గుణగుణాలను మెచ్చుకునే ముందు మీ పిల్లల్లో ఉన్న శక్తి సామర్థ్యాలు గుర్తించండి. వారికి ఎందులో అసక్తి ఉందో తెలుసుకుని ప్రోత్సహించండి.

Spread the love