ఎమ్మెల్సీల కేసులో తీర్పు రిజర్వ్‌

హైదరాబాద్‌-నవతెలంగాణ
కేసీఆర్‌ క్యాబినెట్‌ చేసిన సిఫార్సులకు అనుగుణంగా తమను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు గవర్నరు నిరాకరణ ఉత్తర్వులు జారీ చేయటాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, కుర్ర సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరథే ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరుపక్షాలు తరుపు లాయర్లు తమ తమ రాతపూర్వక వాదనల అఫిడవిట్లను కోర్టుకు సమర్పించారు. కుర్ర తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి వాదిస్తూ, గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని తెలిపారు. క్యాబినెట్‌ తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించాలనీ, వేరే మార్గం గవర్నరుకు లేదని చెప్పారు. క్యాబినెట్‌ నిర్ణయంపై మంచిచెడులను క్యాబినెట్టే భరిస్తుందని వివరించారు. ఆ నిర్ణయంపై అభ్యంతరాలు ఉన్నాయని భావిస్తే వాటిని సమీక్ష చేయాలని మాత్రమే గవర్నర్‌ కోరాలని తెలిపారు. క్యాబినెట్‌ నిర్ణయాలను తిరస్కరించే అధికారం రాజ్యాంగంలో గవర్నర్‌కు లేదన్నారు. రాజకీయపార్టీల నేతలని చెప్పి దాసోజును ఎమ్మెల్సీగా నామినేషన్‌ చేసేందుకు తిరస్కరించిన తర్వాత అలాంటి రాజకీయపార్టీకే చెందిన కోదండరాంను నియమించిన గవర్నర్‌ నిబంధనలకు తిలోదకాలిచ్చారని దాసోజు తరఫున సీనియర్‌ అడ్వొకేట్‌ అదిత్య సోంది వాదించారు. గవర్నర్‌ పదవిలో నియమితులయ్యే వాళ్లకు కూడా అప్పటి వరకూ రాజకీయాలతో సంబంధాలు ఉంటాయన్నారు. గవర్నర్‌ పదవిని చేపట్టాక పిటిషనర్లను ఎమ్మెల్సీలుగా నియమించేందుకు నిరాకరించడానికి చెప్పిన రాజకీయ కారణంపై ఆమె నిలబడలేదని గుర్తు చేశారు.
మణికొండలో చెట్ల కొట్టివేతపై వివరణ ఇవ్వండి : ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్‌ మణికొండలో క్రికెట్‌ గ్రౌండ్‌కు అడ్డుగా ఉన్నాయని చెప్పి 40 చెట్లను కొట్టివేయటంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చెట్ల నరికివేతపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి, అటవీ ముఖ్యసంరక్షణాధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌, పురపాలక శాఖ డైరెక్టర్‌ ఫల్గుణ కుమార్‌, మణికొండ మాజీ సర్పంచ్‌ కె.నరేందర్‌ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. అనుమతులు లేకుండానే చెట్లను నరికివేశారని పేర్కొంటూ వాటా పౌండేషన్‌ వ్యవస్థాపకుడు పి. ఉదరుకృష్ణ పిల్‌ దాఖలు చేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే, జస్టిస్‌ జె అనిల్‌ కుమార్లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది.
జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి మధ్య ఫ్లైఓవర్‌ కట్టేందుకు 2017లో వంద చెట్లను కొట్టివేయాల్సివస్తే వాటిని ఉచితంగా మణికొండ శ్మశానవాటిక, క్రికెట్‌ గ్రౌండ్‌ వద్ద నాటామనీ, అందులో 70 చెట్లు బతికితే ఇప్పుడు చెప్పాపెట్టకుండా 40 చెట్లను అధికారులు కొట్టేశారని పిటిషనర్‌ తరుపు లాయర్‌ చెప్పారు. కనీసం ముందుగా చెప్పి ఉంటే వాటిని మరో చోట నాటేందుకు ప్రయత్నించేవాళ్లమనీ, పిటిషనర్‌కు చెందిన సంస్థ ఉచిత సేవల గురించి తెలిసి కూడా అధికారులు విచక్షణారహితంగా వ్యవహరించారని చెప్పారు..వాదనల తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన డివిజన్‌బెంచ్‌ విచారణను మార్చి ఆరుకు వాయిదా వేసింది.
ఆ సిన్మాపై వ్యాజ్యం
సందీప్‌ కిషన్‌ నటించిన ‘ఊరిపేరు భైరవకోన’ సినిమాపై పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఆ సినిమా ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలైంది. విశాఖకు చెందిన గాయత్రి ఫిలిమ్స్‌ దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌ను గురురవారం న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.నంద విచారించారు. సినిమా ప్రదర్శనను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్‌ వినతిని తోసిపుచ్చారు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు.

Spread the love