కాస్త వానకే భద్రాచలం రాముడి అన్నదాన సత్రంలోకి వరదనీరు..!

నవతెలంగాణ – భద్రాచలం : ప్రతీ సంవత్సరం ఆగష్టు, సెప్టెంబర్‌ నెలల్లో గోదావరి నది పోటెత్తితే భారీ వరదలు పెద్ద ఎత్తున భద్రాచలం సీతారామచంద్రస్వామి దగ్గర ఉన్న అన్నదాన సత్రంలోకి చేరతాయి. అయితే ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మామూలు చిన్న వర్షానికే సత్రంలోకి వరదనీరు చేరింది. శుక్రవారం భద్రాచలంలో 5 సెంటి మీటర్ల వర్షం కురవడంతో అన్నదాన సత్రంలోకి వరదనీరు చేరింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ … అప్పటి మంత్రి కెటిఆర్‌ వచ్చిన సందర్భంగా బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ వర్షం కురుస్తున్న సమయంలో కాలు జారీ డ్రైనేజీలో పడి మృతి చెందారు. ఈ ఘటన కూడా అప్పుడు అన్నదాన సత్రం దగ్గరే జరిగింది. దీనికి కారణం అక్కడి డ్రైనేజీ వ్యవస్థ దెబ్బ తినడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో అన్నదాన సత్రాన్ని మూసేశారు. ఈ రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ప్యాకెట్ల ద్వారా అన్నదానం చేయనున్నారు. అయితే, గత ప్రభుత్వం గోదావరి నదిపై రక్షణ వలయం కట్టేందుకు ప్లాన్‌ చేసినా ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు. దీంతో చిన్నపాటి వర్షాలకే ఈ వరద ప్రవాహం భద్రాద్రి రామయ్య ఆలయాన్ని ముంచేస్తుంది. దీంతో వర్షం కురిసే సమయంలో డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, ప్రజలు అక్కడికి రావలంటేనే ఆందోళన చెందుతున్నారు. అధికారులు గోదావరి నదిపై రక్షణ వలయాన్ని కట్టాలని కోరుతున్నారు.

Spread the love