కొన్ని కవితలంతే

కొన్ని కవితలంతే‘ఫేస్‌ బుక్‌’ లో కవితలు చదువుతుంటే ‘కవిసంగమం’లో ఈ కవిత కంటబడింది. సాధారణ కవితా వాక్యాలుగా ఉన్న ఈ కవితలో బలమంతా ముగింపులో ఉంది. మెరుపుతో ఈ కవిత తారాస్థాయికి చేరుకుంది. ఇందులో జీవకారుణ్య భావన ఉంది. పర్యావరణ స్పహ ఉంది. మతసామరస్యాన్ని చాటే సమైక్యతాభావం ఉన్నది. ఇంత చిన్న కవితలో ఇన్ని విషయాలు మాట్లాడగలిగాడంటే ఈ కవికి సామాజిక అవగాహన మెండుగా ఉందని అర్థమవుతుంది. పాణిరావు యర్రగుంట్ల గారు రచించిన ఈ కవిత వర్తమాన కవిత్వంలో విశ్లేషించుకుందాం.
పట్టుమని పది లైన్స్‌ లేని కవిత ఇది. కానీ దీని విస్తతి చాలా పెద్దది. ఎత్తుగడలోనే కవి పక్షుల పట్ల మన కనీస ధర్మాన్ని తెలియజేశాడు. నీటివనరులు తరిగిపోతున్న ఈ కాలాన మనుషులే నానా తంటాలు పడుతున్నారు. పక్షులు పడే గోస మాములుది కాదు. వాటిని రక్షిస్తూ కవి పక్షులకు నీళ్ళు పెట్టమంటున్నాడు.
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉంది. అడవులు తరిగిపోతున్నాయి. భూమి వేడెక్కుతున్నది. మనిషికో మొక్క నాటమనే నినాదం ఈ మధ్యలో చాలా సార్లు వింటున్నాం. పుట్టినరోజున మొక్క నాటమనడం, ఏ శుభ కార్యమయినా మొక్క నాటమని చెప్పటం చూస్తుంటాం. ఇందులోని ఆంతర్యమంతా ప్రకతిని రక్షించుకోవటంలో భాగమే. ఈ కవి చూపు కూడా అందుకు సంబంధించిందే. సందేశాత్మకతతో కూడిన జీవనసత్యం ఈ వాక్యాల్లో ఇమిడి ఉంది.
చివరగా ఇచ్చిన బలమైన ముగింపు కవితకు ప్రాణం పోసింది. ఒక వాక్యం దాని సమర్థింపు, మరొక వాక్యం దాని సమర్థింపు ఇలా సాగిన కవిత విభిన్న శైలిని సంతరించుకుంది. మాట్లాడుకున్నట్టే ఉండే ఈ శైలిలో కవిత ద్వారా కవి సమాజాన్ని మార్చాలనే దక్పథం కనిపిస్తుంది. బతకటమెలాగో నేర్పిస్తున్నాడు. పొంచివున్న ప్రమాదాలకు స్పీడ్‌ బ్రేకర్లు వేస్తున్నాడు. దేశాన్ని బతికించే మందు ఏమిటో తెలియజేస్తూ ప్రిస్క్రిప్షన్‌ రాస్తున్నాడు. మూడు పూటలు ట్యాబ్లెట్‌గా వేసుకొని మింగమంటున్నాడు. సీరియస్‌గా ఉన్న దేశ కాలమాన పరిస్థితులను కాపాడమని హితవు పలుకుతున్నాడు.
చూడటానికి వచనంలా కనిపించినా ఈ వాక్యాల్లో అన్వయం జోడించడం వల్ల కవితా లక్షణాన్ని సంతరించుకుంది. ఇది చదివిన వారిని అబ్బురపరిచే కవిత. కొద్దిసేపు ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. ప్రతి ఒక్కరు ఆచరిస్తే దేశదేశాల్లో మనదేశం కీర్తి పతాక రెపరెపలాడుతుంది. మనుషులందరికీ అవగాహన కలిగించటానికి ఈ వాక్యాలు సూక్తులుగా ఉపయోగపడుతాయి. సామాజిక ప్రయోజనం కలిగించే కవిత ఇది. ఎంతో అవగాహన ఉంటే తప్ప ఈ వాక్యాలు బయటికి రావు.
ఈ కవితకు శీర్షిక పెట్టలేదు కవి. కవిత మొదలు పెట్టి చదివితే శీర్షికే గుర్తుకురాదు. కొన్ని కవితలకు మంచి శీర్షికలున్నా అందులో కవిత్వం ఉండదు. కొన్ని కవితలకు శీర్షికలు లేకున్న కవిత్వం ప్రభావితం చేస్తుంది. శీర్షిక లేకుండా కవితను మెప్పించడం చాలా కష్టం. ఇక్కడ శీర్షిక చేర్చితే కవిత అందమే చెడిపోతుంది. కొన్ని కవితలంతే. కవి రాయడు. కవితే తనను రాయించుకుంటుంది.

రోజూ నీళ్ళు పెట్టండి
పక్షులు బ్రతుకుతాయి.

వారానికి ఒక మొక్క నాటండి
మనిషి బ్రతుకుతాడు.హొ

నెలకొక్కసారైనా ఓ మనిషికి చెప్పండి
మతసామరస్యమే రక్ష అని.
ఈ దేశం బ్రతుకుతుంది.

హొహొహొహొహొహొహొ- పాణిరావు యర్రగుంట్ల

 

– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551

Spread the love