కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!: కేటీఆర్

revanth-ktr-is-preparing-to-join-bjpనవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. కేవలం 120 రోజుల పాలనలోనే నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు మోసగించిందంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో గురువారం సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను తన పోస్ట్ కు జత చేశారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గాలికొదిలిసింది అంటూ కేటీఆర్ పెట్టిన పోస్ట్. అధికారంలోకి రాగానే రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంకా గాంధీ సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాటతప్పారు. అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదంటూ తోసిపుచ్చారు. ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇస్తూ కాంగ్రెస్ న్యూస్ పేపర్ లలో జాబ్ కేలండర్ గురించి ఫ్రంట్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. కానీ వాస్తవానికొస్తే… బీఆర్ఎస్ పాలనలో భర్తీ చసిన 30 వేల ఉద్యోగాలకు సంబంధించి కేవలం అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి దాన్ని తమ ఘనతగా చెప్పుకుంటోంది. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ నిస్సిగ్గుగా యూటర్న్ తీసుకుంది. టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుంచి రూ. 2,000కు (రెండు పేపర్లకు) పెంచింది. చాలా పోటీ పరీక్షల రద్దు కావడం, కోర్టుల్లో కేసులు నమోదు కావడానికి బల్మూరి వెంకట్ లాంటి కాంగ్రెస్ నాయకులు కారణం అయ్యారు. అయితే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ పదవిని కానుకగా పొందాడు. కానీ నిరుద్యోగ యువతను మాత్రం గాలికొదిలేశారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పుడు అందరి ముందు బయటపడింది. తమను మోసగించినందుకు కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది.

Spread the love