ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ : కేసీఆర్

నవతెలంగాణ – న‌ల్ల‌గొండ : కృష్ణా న‌దిలో మ‌న వాటాకు వ‌చ్చే నీళ్ల‌ను దొబ్బి పోదామ‌నుకునే స్వార్థ శ‌క్తుల‌కు హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. న‌ల్ల‌గొండ జిల్లాలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. కొంత మంది స‌న్నాసులు తెలివి లేక వాళ్ల‌కు వ్య‌తిరేకం అనుకుంటున్నారు ఈ స‌భ‌. ఉవ్వెత్తున మ‌నం ఉద్య‌మం లాగా ఎగిసిప‌డ‌క‌పోతే మ‌న‌ల్ని మ‌నం కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌క‌పోతే ఎవ‌రూ కూడా మ‌న ర‌క్ష‌ణ‌కు రాడు. మీరు ఈ మాట గుండెల్లో రాసిపెట్టుకోండి. ఫ్లోరైడ్ నాడు ఎవ‌డూ రాలేడు. ఓట్లు ఉన్న‌ప్పుడు నంగ‌నాచి క‌బుర్లు చెబుతారు. కానీ త‌ర్వాత ఎవ‌రూ రాడు. ఓటు గుద్దిన‌క గ‌డ్డ‌కెక్కిరంటే మ‌న వీపుల గుద్ది బొంద‌ల నూకుతుండ్రు త‌ప్ప ఎవ‌రూ రాలేదు. ఇది జ‌రిగిన చ‌రిత్ర‌. ఇప్పుడు జ‌రుగుతున్న చ‌రిత్ర‌.. ద‌య‌చేసి మీరు గ‌మ‌నించాలి. ఇది ఆషామాషీ కాదు. ఇది చిల్ల‌ర‌మ‌ల్ల‌ర రాజ‌కీయ స‌భ కాదు. రాష్ట్ర ప్ర‌భుత్వానికి కాదు, రాష్ట్ర నాయ‌కుల‌కు కాదు.. ఇవాళ నీళ్లు పంచ‌డానికి సిద్ధంగా ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యున‌ల్‌కు కానీ, కేంద్ర ప్ర‌భుత్వానికి గానీ, కేంద్ర నీటిపారుద‌ల మంత్రికి గానీ, మ‌న నీటిని దొబ్బి పోదామనుకునే స్వార్థ శ‌క్తుల‌కు గానీ ఒక హెచ్చ‌రిక ఈ చ‌లో న‌ల్ల‌గొండ స‌భ‌. ఏ ఒక్క‌రికో, ఓ వ్య‌క్తికో, కొద్ది మంది, పిడికెడు మంది గురించో స‌భ కాదు. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్ర‌జ‌ల యొక్క జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. ఇప్పుడు జ‌రుగుతున్న‌ది చూసిన త‌ర్వాత చాలా బాధ‌ప‌డ్డాం అని కేసీఆర్ తెలిపారు. నేనేం త‌క్కువ చేయ‌లేదు.. మీ అంద‌రి ఆశీస్సుల‌తో ఉద్య‌మాన్ని విజ‌యంవంతం చేశాం. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీ అంద‌రి దీవేన‌తో ప‌ది ఏండ్లు ఈ గ‌డ్డ‌ను పారిపాల‌న చేశాను. ఎక్క‌డో పోయిన క‌రెంట్‌ను తెచ్చి నిమిషం పాటు క‌రెంట్ పోకుండా స‌ప్ల‌యి చేయించినం. ప్ర‌తి ఇంట్లో న‌ల్లా పెట్టి మంచినీళ్లు ఇచ్చాం. ఒక‌నాడు ఆముదాలు మాత్ర‌మే పండిన న‌ల్ల‌గొండ‌లో, బ‌త్తాయి తోట‌ల‌తో బ‌తికిన న‌ల్ల‌గొండ‌లో ల‌క్ష‌ల ల‌క్ష‌ల ట‌న్నుల వ‌రిధాన్యం పండించే ప‌రిస్థితులు తెచ్చుకున్నాం. అంత‌కుముందు లేని నీళ్లు యెడికెళ్లి వ‌చ్చిన‌య్ అంటే ద‌మ్ము కావాలి.. చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం నా గ‌డ్డ‌, నా ప్ర‌జ‌లు అనే ఆరాటం ఉంటే ఎట్లైనా సాధించి రావొచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.
చ‌లో న‌ల్ల‌గొండ స‌భ రాజ‌కీయ స‌భ కానేకాదు.. ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు. కృష్ణా జ‌లాల్లో తెలంగాణ వాటా కోసం ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఒక్క పిలుపుతో పులులాగా క‌దిలివ‌చ్చిన అన్నాచెల్లెల్లు, అక్కాత‌మ్ముళ్ల‌కు ఉద్య‌మాభివ‌నంద‌నాలు. ఇవాళ న‌ల్ల‌గొండ‌లో చ‌లో న‌ల్ల‌గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కార‌ణం ఏందంటే.. ఎందుకు మ‌నం ఈ స‌భ పెట్టాల్సి వ‌చ్చింది. నాకు కాలు విరిగిపోయినా కుంటి న‌డ‌క‌తోనే, క‌ట్టె ప‌ట్టుకోని ఇంత ఆయాసంతో ఎందుకు రావాల్సి వ‌చ్చింది. ఈ విష‌యం ద‌య‌చేసి అంద‌రూ ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు. కొంద‌రికి ఇది రాజ‌కీయం. మ‌నం పెట్టింది ఉద్య‌మ స‌భ‌, పోరాట స‌భ‌, రాజ‌కీయ స‌భ కానే కాదు. కృష్ణా న‌దిలో మ‌న జ‌లాలు, నీళ్ల మీద మ‌న హ‌క్కు అనేది మ‌నంద‌రి బ‌తుకుల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌. చావో రేవో తేల్చే స‌మ‌స్య‌. ఈ మాట 24 ఏండ్ల నుంచి ప‌క్షిలాగా తిరుగుకుంటూ మొత్తం రాష్ట్రానికి చెబుతున్నా. ఇటు కృష్ణా కావొచ్చు. అటు గోదావ‌రి కావొచ్చు. నీళ్లు లేక‌పోతే మ‌న‌కు బ‌తుకు లేదు. ఆ ఉన్న నీళ్లు కూడా స‌రిగా లేక‌పోతే బతుకులు వంగిపోయాయి ఈ న‌ల్ల‌గొండ‌లో. ల‌క్షా 50 వేల మంది మునుగోడు, దేవ‌ర‌కొండతో పాటు ఇత‌ర ప్రాంతాల బిడ్డ‌ల‌ న‌డుము వంగిపోయాయి. చివ‌ర‌కు ఈ జిల్లాలో ఉద్య‌మ‌కారులంద‌రూ క‌లిసి ఫ్లోరైడ్ బారిన‌ప‌డ్డ‌ బిడ్డ‌ల‌ను తీసుకుపోయి ప్ర‌ధాన‌మంత్రి టేబుల్ మీద పండ‌వెడితే అయ్యా మా బ‌తుకు ఇది అంటే కూడా ప‌ట్టించుకోలేదు. ఆనాడు పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లేరా. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత ఫ్లోరైడ్ ర‌హితంగా త‌యారు చేశాం. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌లు కూడా చెబుతున్నారు. భ‌గీర‌థ నీళ్లు వ‌చ్చాక ఆ బాధ‌లు పోయాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని కేసీఆర్ తెలిపారు.

Spread the love