దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

నవతెలంగాణ -న్యూఢిల్లీ : దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ తాను అయోధ్యకు వెళితే సహించేవారా? అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లు ఎస్‌సి, ఎస్‌టి కమ్యూనిటికి చెందినవారు కావడంతోనే బిజెపి ప్రభుత్వం వారిని ఘోరంగా అవమానించిందని మండిపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య రామ మందిర ప్రతిష్టాపనకు, నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని అన్నారు. అలాగే పార్లమెంట్‌ భవనం శంకుస్థాపనకు రామ్‌నాథ్‌ కోవింద్‌కు కూడా ఆహ్వానం అందలేదని అన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే రామ మందిరం ప్రతిష్టాపనకు కాంగ్రెస్‌ దూరంగా ఉందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండించారు. దళితులను ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించడం లేదని, ఒకవేళ తాను అయోధ్యకు వెళితే అంగీకరించేవారా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామన్న ప్రధాని వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మూడోసారి అధికారంలోకి వస్తామని ప్రధాని కలలు కంటున్నారని, కానీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని బిజెపి నేతలు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. రామమందిర ప్రతిష్టాపనకు కాంగ్రెస్‌ హాజరై ఉండాల్సిందని మీరు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ఖర్గే ఘాటుగా స్పందించారు. మత విశ్వాసమనేది వ్యక్తిగత అంశమని, ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి సందర్శిస్తారని అన్నారు. ప్రధాని మోడీ పూజారి కాదని, రాజకీయ ప్రచారం కోసం రాముని విగ్రహాన్ని ప్రతిష్టించారని దుయ్యబట్టారు. రామమందిరంలో మూడొంతుల నిర్మాణం ఇంకా పూర్తి కావాల్సి వుందన్నారు. ఇది రాజకీయ వేడుకా లేదా మత వేడుకా అర్థం కాలేదని, రాజకీయాల్లోకి మతాన్ని ఎందుకు కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికీ దేశవ్యాప్తంగా చాలా గ్రామాల్లో దళితులను దేవాలయాల్లోకి, విద్యా సంస్థల్లోకి రానీయడం లేదని, కనీసం మంచినీరు తాగేందుకు కూడా అనుమతించరని అన్నారు. ఓ దళిత వ్యక్తి వివాహ వేడుకలో గుర్రంపై సవారీ చేయడాన్ని కూడా సహించలేరని మండిపడ్డారు. అతనిని గుర్రంపై నుండి లాగి కిందపడేసి, తీవ్రంగా కొట్టిన ఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. రాజకీయ ప్రచారం కోసమే తనతో పాటు మరికొందరికి ఆహ్వానాలు పంపారని ఎద్దేవా చేశారు. ఇక్కడ ప్రశ్న రామమందిరం అహ్వానం గురించి కాదని, తన ప్రజలను అవమానిస్తున్నారని, దోచుకుంటున్నారని మండిపడ్డారు. వారికి స్వేచ్ఛ కావాలని అన్నారు. మార్పు కోరుకుంటుంది ప్రతిపక్షాలు కాదు ఈ దేశ ప్రజలని రుజువవుతుందని అన్నారు. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. గతంలో కేవలం ఒక రాష్ట్రంలో పర్యటించేవారని, రెండు లేదా మూడు సమావేశాలు నిర్వహించే వారని కానీ ఇప్పుడు మోడీ భయపడుతున్నారని అన్నారు. కార్పోరేట్లకు పూలమాల వేసి స్వాగతం పలికేందుకు కూడా ఆయన హాజరవుతున్నారని, అవినీతిపరులనందరినీ కూడగట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అధిక సీట్లు సాధిస్తుందని, ప్రధానిని ఓడించేందుకు ఆ సంఖ్య సరిపోతుందని అన్నారు. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన వారిని దేశవ్యతిరేకులుగా పరిగణిస్తారని, కానీ బిజెపి నేతలు రాజ్యాంగాన్ని మారుస్తామని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది మహిళలు, బలహీనవర్గాలను అణచివేసేందుకు కుట్రకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

Spread the love