సింగపూర్‌లో ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాకు ఎదురుదెబ్బ..

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియాలో పాప్యులర్ మసాలా బ్రాండ్ అయిన ఎవరెస్ట్‌కు సింగపూర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఆ కంపెనీ ఉత్పత్తి అయిన చేపల కూర మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ అనే పురుగుమందు అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని పేర్కొంటూ ఆ మసాలాను వెనక్కి తీసుకోవాలంటూ సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (ఎస్ఎఫ్ఏ) నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలంటూ ఎవరెస్ట్ మసాలను దిగుమతి చేసుకొనే ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఆదేశించింది. ఈ మసాలాను కొనుగోలు చేసిన వినియోగదారులు ఎవరూ దానిని వినియోగించవద్దని కోరింది. ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహారంలో ఉపయోగించడానికి లేదని, వ్యవసాయంలో సూక్ష్మజీవుల నివారణకు మాత్రమే ఉపయోగిస్తారని తెలిపింది. ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహార పదార్ధాల్లో ఉపయోగించడానికి సింగపూర్ ఫుడ్ రెగ్యులేషన్స్ అనుమతించదని పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలపై ఫుడ్ ఏజెన్సీ స్పందించింది. ఇథిలిన్ ఆక్సైడ్‌ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పేమీ లేదని తెలిపింది. ఏది ఏమైనా దీని వాడకాన్ని వీలైనంతగా తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వివరించింది.

Spread the love