– కొడుకు పరీక్షలు సరైన కారణం కాదు : ట్రయల్ కోర్టు
– ప్రభావితం చేయలేరని, నమ్మలేమని ఉత్తర్వులో వెల్లడి
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ఈ బెయిల్ పై ఈడీ చేసిన అభ్యంతరాలు, కోర్టులో పేర్కొన్న ఆధారాలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పిల్లల పరీక్షలకు సంబంధించిన ఆందోళనను పరిష్కరించడానికి తల్లినే సరైన ప్రత్యామ్నాయం అన్న ‘బలవంతపు కారణం’తో కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని అభిప్రాయపడింది. అలాగే సెక్షన్ 45(1) అనేది మైనర్లు, అమాయకులు, పలు నేరాల్లో బలిపశువులు, మోసపోయిన మహిళకు వర్తిస్తుందని, కానీ కవిత లాంటి ఉన్నత విద్యావంతురాలు ఈ కేసులో బలిపశువైనట్లు భావించడం లేదని స్పష్టం చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో స్కాంలో కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలు, ఆమె ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరమని పేర్కొంది. ఈడీ కోర్టు ముందుంచిన ఆధారాల ప్రకారం.. దర్యాప్తునకు ముందు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కవిత తన ఫోన్లను ఫార్మాట్ చేశారని పేర్కొంది. నోటీసులందిన తరువాత డిజిటల్ డివైజ్‌లలోని సమాచారాన్ని తొలగించినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా వెల్లడించబడిందని తెలిపింది. అలాగే సాక్ష్యులను ప్రభావితం చేయడంలోనూ కీలక పాత్ర పోషించారని, బెయిల్ వస్తే అదే తీరును కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపింది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కాగా, మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత తన చిన్న కొడుకుకు 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో తనకు అండగా ఉండేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. అలాగే పీఎంఎల్‌ఏ 45 ప్రకారం మహిళనైన తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు ఈనెల 1, 4 తేదీల్లో ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా ఇరువైపు వాదనలు విన్న సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి బవేజా 4న తీర్పును సోమవారానికి రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా సోమవారం 21 పేజీలతో తీర్పు వెలువరించారు. వాది, ప్రతివాదులతో పాటు తీహార్ జైల్ సూపరిండెంటెండ్‌కు ఈ మెయిల్ ద్వారా ఈ కాపీని అందజేశారు. కవితను బలిపశువుగా భావించలేంలిక్కర్ స్కాంలో కవితను బలిపశువును చేశారనే వాదనతో తాము ఏకీభవించడం లేదని కోర్టు పేర్కొంది. వాదనల సందర్భంగా కవిత న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ముందుకు తెచ్చిన అంశాలపై తీర్పులో స్పష్టత ఇచ్చారు. సౌమ్య చౌరాసియా (సుప్ర) కేసులో సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను కోర్టు గుర్తు చేసింది. సెక్షన్ 45 ప్రొవిజన్స్‌ను తప్పనిసరిగా, విధిగా భావించలేమని పేర్కొన్నట్లు తెలిపింది. మైనర్లు, అమాయకులు, పలువురి చేతిలో బలిపశువుగా మారిన వారి విషయంలో సానుభూతి చూపాలని, అంతేకానీ నేడు కొందరు విద్యావంతులు, ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు వ్యాపారంలో ఉన్నవారిపై కాదని తీర్పులో పొందిపరిచినట్లు తెలిపింది. ఇదే కోవలో కవిత కూడా ఉన్నారని పేర్కొంది. బ్యాచులర్ ఇన్ ఇంజనీరింగ్, మాస్టర్ ఇన్ సైన్ప్ డిగ్రీలో కోర్సులను ఉన్నతమైన వర్శిటీలలో పూర్తి చేసినట్లు గుర్తు చేసింది. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్సీగా, మాజీ ఎంపీగా, లోక్‌సభ కమిటీల్లో పని చేశారని పేర్కొంది. ఉప రాష్ట్రపతి, లోక్‌సభ ప్రతినిధులతో కలిసి ఆమె కొలంబియా, బ్రెజిల్, బెల్జియం సందర్శించారని వెల్లడించింది. రాజకీయాల్లోకి రాకముందు ఆమె తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్‌తో సేవలందించారని, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు తెలంగాణ స్టేట్ కమిషనర్‌గా చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారని తెలిపింది. ఈ అంశాల నేపథ్యంలో కవితను ఏవిధంగా బలిపశువుగా భావించలేమని స్పష్టం చేసింది. కవితపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, ఈడీ ఇంకా దర్యాప్తులో కీలక విషయంలో రాబట్టాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వలేకపోతున్నట్లు స్పష్టం చేసింది. a