శాంతి భద్రతల పరిరక్షనే కేసీఆర్‌ ధ్యేయం

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
శాంతి భద్రతల సౌలభ్యం శాంతిభద్రతల పరిరక్షనే కేసీఆర్‌ ధ్యేయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సురక్షా దినోత్సవం సందర్భంగా తెలంగాణ దతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అత్యుత్తమంగా శాంతి, భద్రతలు కాపాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యే సమయంలో శాంతి భద్రతలు తప్పడం, నక్సలిజం పెరుగుతుందనే వంటి అనేక అపోహలను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మన పోలీసు శాఖ పటా పంచలు చేసిందని, దేశంలోనే అత్యుత్తమంగా శాంతి భద్రతలను కాపాడుతూ మన పోలీసులు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో అధిక పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద ఎత్తున బడ్జెట్‌ కేటాయించి పోలీసులకు ఆధునిక పేట్రోలింగ్‌ వాహనాలు అందించారని, డయల్‌ 100 వ్యవస్థను పటిష్టం చేశారని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించామని, నూతన పోలీస్‌ నియామకాలలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించి, ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహిళా భద్రతకు ఏర్పాటు చేసిన షీ టీమ్స్‌ దేశానికి ఆదర్శప్రాయమన్నారు. మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షీ టీమ్స్‌ లు అద్భుతమైన విజయాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచారని, అనేక రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నూతన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ కల్పించామని, రాజకీయ జోక్యాన్ని తగ్గించామని, పోలీస్‌ శాఖ అమలు చేస్తున్న నూతన విధానాల ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా గత 9 సంవత్సరాలలో క్రైమ్‌ రేట్‌ తగ్గిపోయిందని, దేశంలో సురక్షితమైన మహా నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని అన్నారు. ఆధునిక నేరాలను అరికట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, వసతులు పోలీస్‌ శాఖకు అందిస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా మోడల్‌ పోలీస్‌ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారని తెలిపారు.
సీసీ కేమెరాలతో పకడ్బందీ నిఘా
దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న సీసీ కేమేరాల్లో 70శాతం మన రాష్ట్రంలో ఏర్పాటు చేసి పటిష్ట నిఘా పెట్టారు అని సీసీ కెమెరాలను స్థానిక పోలీస్‌ స్టేషన్లకు అనుసంధానం చేశారని అన్నారు. గతంలో పోలీసుల పట్ల ఉన్న భయం స్థానంలో ప్రస్తుతం గౌరవం ఏర్పడిందని అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ ప్రభాకర్‌, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ అయుమ్‌, ప్రదీప్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ రాజ్‌ కుమార్‌, ముడిమ్యల్‌ పిఏసిఎస్‌ చైర్మన్‌ గోనె ప్రతాప్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు కృష్ణారెడ్డి వెంకటేష్‌ రవీందర్‌, శ్రీనివాస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love