హామీని నిలబెట్టుకోవాలి

Keep the promise– మంత్రి మల్లారెడ్డి ఇంటి ముందు భవన నిర్మాణ కార్మికుల ధర్నా
– ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని డిమాండ్‌
నవతెలంగాణ – కంటోన్మెంట్‌/బాలానగర్‌
లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్‌, గౌరవ అధ్యక్షులు వంగూరు రాములు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు మంగళవారం హైదరాబాద్‌ న్యూ బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద ధర్నా చేశారు. ఆ సమయంలో మంత్రి లేరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు ఒక లక్ష ద్విచక్ర వాహనాలను అందజేస్తామని మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ఇప్పటికీ అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వడం లేదన్నారు. ఇప్పటికైనా మంత్రి హామీని వెంటనే అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని, లేదంటే ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు. సెస్‌ మీద వసూలు చేసిన వెల్ఫేర్‌ బోర్డు డబ్బును సంక్షేమ పథకాల పేరుతో వీటి నుంచి వాటికి బదిలీ చేయొద్దని కోరారు. భవన నిర్మాణ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని, మహిళా కార్మికులకు ప్రసవం జరిగినప్పుడు రూ.30 వేలు ఇచ్చే దానిని రూ.లక్షకు పెంచాలని, పెండ్లి కానుక రూ.30 వేల నుంచి లక్షకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా అడ్డాలలో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, నివాసం ఉండేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు ఎర్ర అశోక్‌, ఉపాధ్యక్షులు జె.వెంకన్న, సహాయకార్యదర్శులె ఐలాపురం రాజశేఖర్‌, జె.శ్రీనివాసులు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు రాజు, సత్యనారాయణ, లక్ష్మయ్య, ఆనంద్‌, కృష్ణవేణి, కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Spread the love