– భూముల ధరలు కోకాపేట్ భూముల ధరల వలె పెరగాలి
– త్వరలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– పట్టా భూముల ధరకు సమానంగానే అసైన్డ్ భూములకు పరిహారం
– వంశీచందర్‌రెడ్డికి 50 వేల మెజార్టీ ఇవ్వాలి
– ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ సభ
– కొడంగల్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
కొడంగల్ అభివృద్ధికి ప్రజలు సహకరించినప్పుడే రాష్ట్రానికి మన ప్రాంతం ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌కు మంచి అవకాశం వచ్చిందని, అభివృద్ధికి సహకరించాలని.. అప్పుడే కోకాపేట్ భూముల వలె మన భూములకు ధరలు పెరుగుతాయని నియోజకవర్గ ప్రజలను కోరారు. గురువారం మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొడంగల్‌కు వచ్చిన సీఎం.. ఆయన నివాసంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మెన్ గుర్నాథ్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ అభివృద్ధి కోసం.. మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్, నర్సింగ్, కళాశాలకు పర్మిషన్ ఇచ్చామని, వీటికి భూములిచ్చి ప్రజలు సహకరించాలని కోరారు. మన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు రావడంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడంతో పాటు వ్యాపారం కూడా పెరుగుతుందన్నారు. పట్టా భూములకు ఎంత నష్టపరిహారం అందిస్తామో.. అసైన్డ్ భూములకు అంతే నష్టపరిహారం అందించి రైతుల దగ్గర భూములు సేకరించాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. కస్తూరిపల్లి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. అపారమైన సున్నపు గనులు ఉన్నా గత పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే ఇక్కడ పరిస్థితులు మారలేదన్నారు. పరిశ్రమలు రావడం వల్ల కొడంగల్‌లో భూముల రేట్లు భారీగా పెరుగుతాయన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిధులు తెచ్చి ఫౌండేషన్ వేసుకున్నామన్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ బహిరంగసభకు కొడంగల్ నుంచి 25వేల మంది తరలిరావాలన్నారు. ఈ సభలో రాహుల్‌గాంధీ 5 గ్యారంటీలు ప్రకటిస్తారని తెలిపారు.
వంశీచందర్‌రెడ్డికి
50వేల మెజార్టీ ఇవ్వాలి
మహబూబ్‌నగర్ పార్లమెంటు అభ్యర్థిగా వంశీచందర్ రెడ్డిని సోనియాగాంధీ మనపై నమ్మకంతో ప్రకటించారని సీఎం తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి వంశీచందర్ రెడ్డికి 50వేల మెజార్టీ ఇవ్వాలన్నారు. ఇందుకోసం మూడంచెలుగా సమన్వయ కమిటీలు వేసుకొని పనిచేయాలని సూచించారు. కొడంగల్‌లో ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు వేసుకోవాలని, ఇలా మొత్తం 275 పోలింగ్ బూత్‌లలో పని జరగాలన్నారు. తాను మళ్లీ ఏప్రిల్ 8న ఇక్కడికి వస్తానని, ఆ రోజు ఒక్కో మండలానికి సంబంధించిన కమిటీతో కూర్చొని మాట్లాడుతానని తెలిపారు. ఈ కమిటీలే తర్వాత ఇందిరమ్మ కమిటీలుగా రూపాంతరం చెందుతాయని, ప్రతి పథకం కూడా ఈ కమిటీలు చెప్పిన వారికే అందుతుందని అన్నారు. పోలింగ్ రోజూ ఎన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఇనియోగించుకోవాలని తెలిపారు. సమావేశంలో పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.