500వ మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి

virat-kohliనవతెలంగాణ – హైదరాబాద్
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు టీమిండియా స్టార్‌ కింగ్‌ కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకు ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లో కోహ్లి ఏ మాత్రం నిరాశపరచలేదు. అభిమానులను ఉత్సాహపరుస్తూ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లి సెంచరీకి 13 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లి 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లి సెంచరీకి ముందే పలు రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్టు క్రికెట్‌లో నెంబర్‌-4లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి 7097 పరుగులతో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(13492 పరుగులు) తొలి స్థానంలో ఉండగా.. లంక దిగ్గజం మహేల జయవర్దనే(9509 పరుగులు) రెండో స్థానంలో, సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌(9033 పరుగులు), విండీస్‌ దిగ్గజం బ్రియాన్‌ లారా(77537 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు. 500వ మ్యాచ్‌ ఆడుతున్న కోహ్లి అన్ని ఫార్మాట్లు కలిపి 25548 పరుగులు సాధించాడు. ఇందులో 75 సెంచరీలు, 131 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక తొలి స్థానంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (34,357 పరుగులు), శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(28,016 పరుగులు) రెండో స్థానంలో ఉండగా.. ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌(27,483 పరుగులు), మహేల జయవర్దనే(25957 పరుగులు) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

Spread the love