ఆ రెండు పార్టీలను గెలిపిస్తే 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం : కేటీఆర్

నవతెలంగాణ – కరీంనగర్: తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ లోనే బీజం పడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కొత్త రాష్ట్రం తెలంగాణను రెండుసార్లు కేసీఆర్ చేతుల్లో పెట్టారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్ని మార్పులు వచ్చాయో మీరు ఒకసారి గమనించాలి. కరీంనగర్ లో ఎన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామో చూడండి. కరీంనగర్ లో తాగునీటి సమస్య పరిష్కరించాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా జలకళే కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ను గెలిపిస్తే.. 50 ఏళ్లు వెనక్కి వెళ్తాం.  బీఆర్ఎస్ పాలనలో పల్లెలు బాగుపడుతాయి. గిరిజన తండాల్లో రోడ్లు వస్తున్నాయి. కరెంట్ ఉంది.. మళ్లీ అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.5వేలు చేస్తామన్నారు. వెయ్యి గురుకులాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. చదువుకుంటామనే పిల్లలకు రూ.20లక్షలు ఇచ్చి విదేశాలకు పంపుతున్నామని కేటీఆర్ వివరించారు. మరోవైపు కరీంనగర్ నుంచి గెలిచిన ఎంపీ ఈ ఐదేళ్లలో ఏదైనా పని చేశారా.. ? అని నిలదీశారు కేటీఆర్. గంగుల కమలాకర్ పై పోటీ అంటేనే అందరూ పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ లో పోటీ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్, బీజేపీ నేతలకు తెలుసు అని.. బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.

Spread the love