పార్లమెంటు కన్నా కుంభమేళాకే ప్రాధాన్యం

– బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం మార్పు
– ప్రత్యామ్నాయాన్ని రూపొందించిన ఆర్‌ఎస్‌ఎస్‌
– ఎస్వీకే ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
– వారికి కావాల్సింది సామాజికవేత్తలు కాదు సాధువులు
– విధానాలు కాకుండా అబద్ధాలు, విద్వేషాల ప్రచారం
– ప్రమాదంలో భారత్‌ భవిష్యత్‌
– ఆదర్శాలు, ఆశయాల్లేని యువతరం
– సమాజంలో పెరుగుతున్న అసమానతలు
– సమసమాజం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ప్రజల్లో చైతన్యం పెంచాలి : ప్రొఫెసర్‌ హరగోపాల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
‘రాజ్యాంగ వ్యవస్థలను తొలుత నిర్వీర్యం చేస్తున్నారు. ఆ తర్వాత రాజ్యాంగాన్నే మార్చేయొచ్చు అన్నది నేడు అధికారంలో ఉన్న పాలకుల ఆలోచన. పార్లమెంటు కన్నా కుంభమేళాయే వారికి ప్రధానం. 2024లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది. కొత్త రాజ్యాంగాన్ని అమల్లోకి తెస్తుంది. అందుకోసం 30 మంది సాధువులు అలహాబాద్‌లో కూర్చుని ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రూపొందించారు. భారతదేశం భవిష్యత్తు ప్రమాదంలో పడనుంది. సమసమాజం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి. ప్రజలే వాటిని కాపాడుకోవాలి’అని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అన్నారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహిం చారు. ఈ సందర్భంగా జాతీయజెండాను హర గోపాల్‌ ఆవిష్కరించారు. అనంతరం ‘నీరుకారుతున్న స్వాతంత్య్ర విలువలు-నిలువరించాల్సిన ఆవశ్యకత’ అంశంపై సెమినార్‌ను నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకుల తీరును చూస్తుంటే భారతదేశ భవిష్యత్తు ఏంటీ, రాజ్యాంగం ఉంటుందా? ఉండదా?అన్న ఆందోళన కలుగుతున్న దని చెప్పారు. ఆదర్శాలు, ఆశయాల్లేకుండా యువ తరం గాలిలో కొట్టుకుపోతున్నదని అన్నారు. సమా జంలో అన్ని రకాల అసమానతలను తొలగించాలం టూ ఆర్టికల్‌ 38 చెప్తున్నదన్నారు. దేశ సంపద ఎవరి చేతిలోనూ కేంద్రీకృతం కావొద్దనీ, సర్వ ప్రయోజనా నికి వినియోగించాంటూ ఆర్టికల్‌ 39ఓ ఉందని వివరించారు. ‘మనకు స్వాతంత్య్రం రాలేదన్నారు. రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించలేదు. ఆ వర్గం ఇప్పుడు అధికారంలో ఉంది’అని హరగోపాల్‌ అన్నారు. స్వాతంత్య్రోద్యమ త్యాగాలను గుర్తించని వారు, రాజ్యాంగ విలువలను గౌరవించని వారు అధికారంలో ఉండడం దేశానికే ప్రమాదకరమని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కమిషనర్‌ను నియమించే కమిటీ నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కేంద్రం తొలగించింద న్నారు. ఆ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చారని అన్నారు. దీంతో ఈసీ కేంద్రం గుప్పెట్లో ఉంటుంద న్నారు. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం అవసరం లేదనీ, కేంద్రమే సిఫారసు చేస్తుందంటూ పాలకులు చెప్తున్నారని చెప్పారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ) స్వతంత్రంగా వ్యవ హరించాలన్నారు. ప్రధాని, హోంమంత్రి వంటి వారు తప్పు చేసినా విచారణ చేపట్టాల్సిన సంస్థ అని వివ రించారు. కానీ ఎన్‌హెచ్‌ఆర్సీ కార్యక్రమాలకే ముఖ్య తిధిగా కేంద్ర హోంమంత్రి హాజరైతే ఇక ఆ సంస్థ స్వతంత్రత ఏముంటుందని ప్రశ్నించారు. యూపీ ఎస్సీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కు సంబంధమున్నవారినే కేంద్రీయ విశ్వవిద్యాలయా లకు వీసీలుగా, ఇతర పదవుల్లో నియమిస్తున్నారని చెప్పారు. దేశంలో త్యాగాలు, స్వప్నాలు, విలువలు తలకిందులయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పీఠికలో ఉన్నతమైన విలువలున్నాయని అన్నారు. దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని హరగోపాల్‌ విమర్శించారు. మార్కెట్‌పై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేశా రనీ, విదేశీ వస్తువులను వాడుతున్నామనీ, ఆత్మనిర్భర్‌ భారత్‌ అంటున్నామని ఎద్దేవా చేశారు. సమసమా జం, సామాజిక న్యాయం, కొత్త సమాజం, స్వాతం త్య్రం, స్వేచ్ఛ కోసం వామ పక్షాలు ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సూచించారు. నిజమైన స్వాతం త్య్రం, స్వేచ్ఛ, మనిషిని మనిషి గౌరవించే సమాజం, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అలాంటి సమాజం కోసం ప్రజలందరూ కృషి చేయాలని కోరారు.
హిందూత్వ రాజ్యంగా చేయడమే బీజేపీ లక్ష్యం
హిందూత్వ రాజ్యంగా చేయడమే బీజేపీ లక్ష్యమని సెమినార్‌లో పాల్గొన్న నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ సంపాదకులు కె ఆనందాచారి అన్నారు. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వందేండ్లు నిండుతాయని చెప్పారు. అమృతోత్సవాల మదనంలో కేంద్రం విషం చిమ్మిందన్నారు. అందుకే అది అసత్యాలతో కూడిన ప్రచారాన్ని పెద్దఎత్తున సాగించిందని అన్నారు. దాన్నుంచి యువతరాన్ని కాపాడుకోవాలని సూచించారు. అధ్యక్షత వహించిన ఎస్వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకికత్వం, సౌభ్రాతృత్వం, అవినీతి రహిత పాలన, రాష్ట్రాలకు హక్కులుండడం, కేంద్రం పెత్తనం ఉండకపోవడం వంటి అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయని వివరించారు. కానీ అవి నిర్వీర్యమై ఏకవ్యక్తి నియంతృత్వంలో అధ్యక్ష తరహా పాలన కనిపిస్తున్నదని విమర్శించారు. పార్లమెంటు అంటే ప్రధానికి లేక్కలేనితనం ఉందన్నారు. మణిపూర్‌లో హింసపై దేశమంతా అట్టుడుకుతుంటే ప్రధాని అపహాస్యం చేశారని విమర్శించారు. ఆ ధోరణిని నిలువరించాల్సిన ఆవశ్యకత ప్రజలపైనే ఉందన్నారు. లేదంటే నియంత పాలనను చూస్తామని చెప్పారు. పిబి చారి రచించిన ‘ఫాసిస్టు ఆర్‌ఎస్‌ఎస్‌ స్వభావం-స్వరూపం’అనే పుస్తకాన్ని హరగోపాల్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీకే బాధ్యులు జి బుచ్చిరెడ్డి, ఎన్‌ సోమయ్య, టీపీఎస్‌కే నాయకులు భూపతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆనందాచారి

Spread the love