– ప్రజా పాలనలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : సీఎం రేవంత్‌కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పాలసీని ప్రకటించాలనీ, ప్రజా పాలనలో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ కోరింది. ఈ మేరకు మంగళవారం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను అందజేశారు. ప్రజాస్వామిక వాతావరణంలో కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించాలని వారు కోరారు. సమస్యలను ఓపికతో వినాలనీ, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కార్మికశాఖను నిస్తేజంగా మార్చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలన నుంచి కాంగ్రెస్ గుణపాఠం తీసుకోవాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన చరిత్ర రాష్ట్రంలో కార్మికులదని వారు తెలిపారు. ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో పరిశీలించాలని పేర్కొన్నారు. కార్మికులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడమే ప్రజా పాలన అని తెలిపారు. పాలక వర్గాల హామీలను కార్మికవర్గం ఆచరణలో అర్థం చేసుకుంటుందని చెప్పారు. ఉద్యోగులు, కార్మికుల కోర్కెలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.