వైవిధ్యం కొరవడితే వినాశనమే

– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578
సూక్ష్మజీవుల నుంచి క్రిమికీటకాల వరకు వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్నీ పరస్పర జీవనం గడపడమే జీవవైవిధ్యం. ఈ వైవిధ్యంలోనే జీవుల మనుగడ ఉంది. సృష్టిలో ఒక జాతి మరోజాతి మనుగడకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. కొత్త జాతుల ఆవిర్భావానికి దారులు తీస్తుంది. సృష్టి నిర్మాణంలో దాగిన రహస్యం ఇదే. ఈ అనంత కోటి జీవుల మధ్య ఉండే ఏ జీవి అయిన, మానవుడు తప్ప మిగిలిన ఏ జీవులు కూడా తమ జోలికి రానంతవరకూ మానవుడికి ఏ విధమైన హానీ తలపెట్టవు. ముఖ్యంగా భూమిపై ఉన్న ప్రతి జీవజాతి మానవునికంటె ముందు ఏర్పడినదే. అయితే మానవుడు తన స్వార్థంతో అత్యాశతో ఇతర అన్ని జీవులమీద తన ఆధిపత్యాన్ని సాధించాడు. ఈ నేపథ్యంలో పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా జీవ వైవిధ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి, అర్థం చేసుకున్నవారు ఇతరులకు చెప్పడానికి- అనేక రూపాలలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్యానికి ఒక రోజును కేటాయించాలని 1993 డిసెంబర్‌ 29న ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానించి, ప్రతీ ఏడాది మే 22న ‘అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం’ జరపాలని నిర్ణయించింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఓ ప్రత్యేక ధీమ్‌తో జీవ వైవిధ్య పరిరక్షణకు కృషి చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం మే 22 వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవం (2023) సందర్భంగా ”ఒప్పందం నుండి చర్య వరకు జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించండి” అనే ధీమ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. క్షీణించిన లేదా నాశనం చేయబడిన పర్యావరణ వ్యవస్థలను తిరిగి నిర్మించడం, పునరుద్ధరించడం యొక్క తక్షణ అవసరాన్ని ఈ థీమ్‌ నొక్కి చెబుతుంది..
ఈ అనంతమైన విశ్వంలో ఇప్పటివరకు భూ గ్రహంపై తప్ప ఇతర గ్రహాలలో జీవం ఉన్నట్లు స్పష్టమైన సమాచారం లేదు. దాదాపు 2000 మిలి యన్‌ల సంవత్సరాలకు పూర్వమే ఈ భూమిపై జీవకణాలు ఏర్పడ్డాయి. మొదట ఏకకణ జీవులు తరువాత బహుకణ జీవులు ఏర్పడ్డాయి. వాటి నుంచి క్రమంగా జరిగిన మార్పులవల్ల వివిధ ఆవాసాల్లో వివిధ జీవజాతులు ఏర్పడ్డాయి. ఈ ఆవాసాల్లో వైవిధ్య భరితమైన వృక్షాలు, జంతువులు వాటి వాటి ప్రత్యేక గుణగణాలతో జీవనం సాగించడమే జీవ వైవిధ్యం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్‌ సంవత్సరాల పరిణామం.
(International Union for Conservation of Natural Resources) (IUCN) ప్రకారం ఒక జాతి జీవుల మధ్య, విభిన్న జాతుల జీవుల మధ్య, అవి నివసిస్తున్న ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్న వైవిధ్యాన్నే జీవ వైవిధ్యం అంటారు.
1968లో అమెరికాకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త రేమండ్‌ ఎఫ్‌. డాస్‌మన్‌ ‘A Different Kind of Country’ అనే గ్రంథంలో తొలిసారిగా Biological Diversity అనే పదాన్ని (జీవ సంబంధ వైవిధ్యం) ఉపయోగించారు. 1985లో డబ్ల్యు.ఎస్‌.రోజెన్‌ అనే మరో పర్యావరణవేత్త, జీవ వైవిధ్యం (Biodiversity) అనే సంక్షిప్త పదాన్ని ప్రతిపాదించారు. 1988లో ఈ.వో. విల్సన్‌ రచించిన గ్రంథంలో జీవవైవిధ్యం అనే పదాన్ని ఉపయోగించారు. తర్వాత కాలంలో జీవ సంబంధ వైవిధ్యం అనే పదమే అధికంగా వాడుకలోకి వచ్చింది. జీవ వైవిధ్యం ప్రకారం సృష్టిలో గల కోటాను కోట్ల జీవరాశులలో ఏ ఒక్క జీవి అధికం కాదు, ఏ ఒక్క జీవి తక్కువ కాదు. అన్ని జీవులు సమానమే, ఎందుకంటే ఈ జీవులన్నీ పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగిస్తుంటాయి. అందుచేత ఈ భూమిపైన అన్ని రకాల జీవులు వుండవలసిందే. అయితే ఈ జీవులలో ప్రత్యేకత సంతరించుకున్న మనిషి మనుగడ మాత్రం ఈ జీవ వైవిధ్యం సజావుగా సాగినప్పుడు మాత్రమే కొనసాగుతుంది..పై విధంగా పర్యావరణంలోని వివిధ జీవావరణ వ్యవస్థలలో వృక్షాలు, జంతువులు ఒకదాని పై మరొకటి ఆధారపడి ఉండే ఒక ప్రక్రియనే ఆహారపు గొలుసు అంటారు. దీనిలో ప్రతీ జీవి వేరొక జీవిపై ఆధారపడే ప్రక్రియ మనకు అర్ధం అవుతుంది. ఆహారం కోసం ఒకరిపై మరొకరు ఆధారపడి ఒక గొలుసులాంటి నిర్మాణం దీనిలో ఉంటుంది. ఇందులో ఏ జీవజాతి కనుమరుగైనా ఈ ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. ఇది అనేక ఇతర జాతుల వినాశనానికి దారితీస్తుంది.
ఆహారపు గోలుసులో ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగపడటం వల్లనే సకల జీవులు మనుగడ సాగిస్తున్నాయి అనే విషయాన్ని విస్మరించడం వల్లనే రానున్న రోజుల్లో మన మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ చరాచర సృష్టిలో జీవజాతుల మధ్య ఉన్న సంబంధాల మధ్య మనిషి ఒక సూక్ష్మభాగం మాత్రమే! అయితే ప్రకృతిలో ఓ భాగమైన మానవుడు మాత్రం తాను ప్రకృతికి అతీతమైన వ్యక్తిగా భావిస్తున్నాడు. భూమిపైనున్న జీవులను కాపాడమని ప్రకృతి మనిషికి మిగిలిన ఏ జీవికి లేనన్ని తెలివితేటల్ని ఇచ్చింది. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు.
సహజ సిద్ధంగా జరిగే ఈ ఆహారపు గొలుసులో మానవుడి అనవసర జోక్యం కూడా జీవ వైవిధ్య నష్టతకు కారణంగా మారింది. ప్రపంచ జనాభాలోని సుమారు ఎనభై శాతం మంది నేరుగా ఈ జీవ వైవిధ్యం మీదనే ఆధారపడి ఉన్నారు. అలాగే నలభై శాతం ఆర్థిక వ్యవస్థ దీనిమీదే ఆధారపడి ఉంది. పర్యావరణాన్ని సమతులంగా ఉంచడానికి, మానవాళి మనుగడ కోసం జీవ వైవిద్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం. ఎందుకంటే సృష్టిలో గల ప్రతీ జీవి ఆహారపు గొలుసుకు లోబడే ఉండటం వలన.
దీనిలో కృత్రిమంగా మనం మార్పులు చెయ్యడానికి ఏ ప్రయత్నం చేసినా సహజ ప్రక్రియకు విరుద్ధంగా మనం వేలు పెట్టినా ఎదురయ్యే దుష్ఫలితాలు అందరం చవి చూడవలసి వస్తుంది. ఎందుకంటే 1983లో భారతదేశం నుంచి ‘అమెరికా, ఫ్రాన్స్‌ మరియు ఇతర యూరోపియన్‌ దేశాలకు 3,650 టన్నుల కప్పలు ఎగుమతి అయ్యాయి. కప్పలను అంత పెద్దమొత్తంలో సేకరించడం వల్ల వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో కప్పలు తినే కీటకాలు, చీడ పురుగుల సంఖ్య తీవ్రంగా పెరిగిపోయిందని శాస్తవ్రేత్తలు గుర్తించారు. వీటివల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. పరిస్థితిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం కప్పల ఎగుమతిని నిషేధిస్తూ 1987న చట్టం తేవలసిన పరిస్ధితి ఏర్పడింది.
భారత్‌ మహా జీవ వైవిధ్యం : ప్రపంచంలో ఏ దేశంలో లేని జీవవైవిధ్యం మన దేశంలో ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మహా జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్న 17 అతిపెద్ద దేశాల్లో భారత్‌ ఒకటిగా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలో 2.3 శాతం భూభాగంలో 12 శాతం జీవ వైవిధ్య జాతులకు నిలయంగా భారత్‌ నిలిచింది. సుమారు 45 వేల వృక్ష జాతులు, దాదాపు 77 వేల జంతు జాతులు ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఇదంతా గత వైభవం. కానీ నేడు ఆ విస్తారమైన జీవ సంపదలో 10 శాతానికిపైగా ప్రమాదంలో ఉంది. వాటిలో చాలా జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలలో 50 శాతానికిపైగా అరణ్యాలు, 70 శాతానికి పైగా నీటి వనరులు లుప్తమైపోయాయి.
విపరీతంగా పెరుగుతున్న జనాభా అవసరాల కోసం జీవ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల మహా జీవ వైవిధ్యంగా పేర్కొన బడ్డ భారత్‌లో కూడా నేడు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఫలితంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం మన ముంగిట నెలకొంది. మొత్తం ప్రపంచం అంతా కూడా జీవుల అంతం చెందటం అనే ఆందోళన మొదలయ్యింది. వీటి అంతానికి ప్రకృతి, మనిషి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
జీవుల అంతానికి కారణాలు : మానవుల లాగే ఈ సృష్టిలో గల ప్రతీ జీవికి జననం, మరణం అనేది సహజ ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో మరణాల స్ధానంలో జననాలు అనేవి భర్తీ చేస్తూ ఉండటం వలన ఆ జాతి నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. అయితే గతంలో మనుగడలో ఉన్న ఏదైనా ఓ జాతి జీవి ప్రస్తుతం ఒక్కటి కూడా కనిపించని స్ధితినే అంతరించిపోవడం అంటారు. అదే ఒక జీవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నట్లయితే దానిని అంతరించే దశలో ఉన్నట్లుగా నిర్దారణ చేస్తారు. ఈ అంతరించడాన్ని పర్యావరణ శాస్త్ర వేత్తలు తిరిగి ఎక్కువ ముప్పు తక్కువ ముప్పుగా వర్గీకరించారు.
ప్రకృతి వైపరీత్యాలు : భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్ధలవడం, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా జీవులు అంతరించి పోవడం అనేది ఏనాటినుండో జరుగుతూ వస్తుంది. ఈ వైపరీత్యాలు సంభవించినప్పుడు సహజ వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించి మనుగడ సాగించలేని పరిస్ధితులలో అనేక జీవులు అంతరించిపోతున్నాయి. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గత ఐదు వందల ఏండ్లలో సుమారు లక్షకు పైగా జీవరాశులు భూమ్మీద నుంచి మాయమయ్యాయని శాస్త్రవేత్తల పరిశోధనలు ద్వారా తెలిసింది. మొత్తం మీద ఈ భూమిపై అనేక జీవుల అంతానికి ప్రకృతిలో సంభవించిన అయిదు పెద్ద వినాశనాలు కారణం అయ్యాయి.
అటవీ వినాశనం : జీవులు అంతరించడానికి మరో ప్రధాన కారణం అడవులు తగ్గిపోవడం. ఇది మనిషి చేస్తున్న పనుల వల్ల జరుగుతున్నదే. ఇండ్లు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా, కోసమంటూ అడవుల్ని నరికేస్తున్నారు. దీనివల్ల అక్కడి జీవులు అంతరిస్తున్నాయి. అమెజాన్‌ అడవుల్లో జరుగుతున్న విధ్వంసమే దీనికి రుజువు.
విచ్చలవిడి వేట : మాంసాహారం కోసం లేదా అడవి జంతువుల విలువైన చర్మం లేదా గోర్లు కొమ్ములు కోసమో విచ్చలవిడిగా వేటాడటం కారణంగా ఇప్పటికే టాస్మేనియన్‌, టైగర్స్‌, పాసెంజర్‌ పీజియన్‌, పెంగ్విన్ల లాంటి గ్రేట్‌ ఓక్‌లు, ఆఫ్రికా దక్షిణ ప్రాంతాల్లోని గుర్రంలాంటి క్వెట్టాలు, ఫాక్‌లాండ్‌ దీవుల్లోని తోడేళ్లు, జాంజిబార్‌ చిరుతలు, కరేబియన్‌ మాంక్‌ సీల్‌లు, కరోలినా పారకీట్స్‌ చిలుకలు, ఆఫ్రికాలోని అట్లాస్‌ ఎలుగుబంట్లు, కంగారు లాంటి వాల్‌బీలు, సీమింక్‌లు, ఆఫ్రికాలోని జింకల్లాంటి బుబల్‌ హార్టెబీస్ట్‌లు, స్టెల్లర్స్‌ సీ కౌలు వంటి జంతువులో ఈ వేట కారణంగానే అంతరించిపోయాయి. అంతే కాదు రానున్న రోజుల్లో ఇప్పుడు అత్యంత అరుదుగా కనిపిస్తున్న పెద్ద దంతాల ఆసియా ఏనుగులు, కొమ్ముల రైనోలు, అరుదైన నక్షత్ర తాబేళ్లు, లెమూర్స్‌, పంగోలియన్స్‌ వంటివి అంతరించిపోయే జాబితాలోకి చేరిపోయాయి.
పట్టణీకరణ : పట్టణీకరణ వలన అడవులు క్షీణిస్తూ పోతున్నాయి. దీని కారణంగా అటవీ జంతువులు ఆహారం కోసం నివాస ప్రాంతాలకు రావడం వలన వాటిని హతమార్చడం సాధారణ విషయంగా మారింది.
గ్లోబల్‌ వార్మింగ్‌ : అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కాలుష్యాన్ని పరిగణలోనికి తీసుకోకుండా చేపట్టే పారిశ్రా మికీకరణ వలన, వాహనాల వినియోగం విపరీతంగా పెరగడం వలన కాలుష్యం ఉధృతమై పోతున్నది దీనివలన భూతాపం విపరీతంగా పెరిగి వాతావరణంలో మార్పులు సంభవించి దాని ప్రభావం జంతువులు పక్షులు పడి వాటి జీవన శైలి ఛిద్రమై కాల గమనంలో అవి అంతరించే స్ధితికి చేరుకుంటున్నాయి. అతివృష్టి అనావృష్టి పరిస్ధితులు సముద్ర మట్టాలు పెరగడం అనేవి జీవుల మనగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఈ మధ్య గ్లోబల్‌వార్మింగ్‌తో 77రకాల జీవజాతులు అంతరించినట్లు ఐయూసీఎన్‌ పేర్కొనడం బట్టి దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
భారత్‌లో అంతరించిన జాతులు : బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (బీఎస్‌ఐ) ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం చెట్లజాతుల్లో 11.5 శాతం, జంతుజాతుల్లో 6.49శాతం ఇండియాలో ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ, పట్టణీకరణ, అటవీ నాశనం వంటి చర్యల వల్ల ఇటీవల దాదాపు 22 రకాల జీవులు అంతరించాయి. వీటిలో ప్రధాన జంతు జాతులు పరిశీలిస్తే..
జావా రైనోసార్స్‌: ఖడ్గ మృగాలుగా చెప్పబడే ఈ జంతువులును వేటాడటం, వాటి ఆవాసాలను ఆక్రమించడం కారణంగా నేడు ప్రపంచంలో ఒక్క ఇండోనేషియా లోని జావా దీవుల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదు. మన దేశంలో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి.
పింక్‌ హెడెడ్‌ డక్‌: ముక్కు నుంచి తల, మెడ వరకు పింక్‌ కలర్‌లో ఉండే ఈ బాతులు మనదేశంలో 1949 నుంచి కనిపించడం లేదు. మయన్మార్‌లో అప్పుడప్పుడూ ఇవి కనిపిస్తుంటాయని చెప్తున్నప్పటికీ రుజువులు మాత్రం లేవు.
ఆసియా చిరుతలు: చిరుతపులుల్లో ఒక రకంగా చెప్పబడే ఆసియా చిరుతలు. ఇవి సుమారు 75 ఏండ్ల కిందటే మనదేశంలో అంతరించాయి. అవి పూర్తిగా అంతరించినట్లు 1952లో భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్య నమీబియా నుంచి వీటినే తెప్పించడం జరిగింది
ఎనుబోతు: ఇండియన్‌ ఆరోచ్‌గా పిలిచే ఈ జాతి జంతువులు 13వ శతాబ్దంలోనే ఇండియాలో అంతరించాయి.
కోలంకి పిట్ట: హిమాలయ పర్వత ప్రాంతాల్లోని దట్టమైన గడ్డిలో ఉంటూ, అక్కడి కీటకాలను తిని నివసించే హిమాలయన్‌ క్వాయిల్‌గా పిలిచే కోలంకి పక్షులు వంద ఏండ్ల కిందటే మనదేశంలో అంతరించాయి
కలివికోడి మాయం! ముళ్లపొదలు ఉండే పచ్చిక మైదానాల్లో జీవించే మన దేశంలో మాత్రమె కనిపించిన కలివి కోడి 1948 నాటికే అంతరించినట్లు శాస్త్రవేత్తలు నిర్దారణ చేశారు..
అంతరించిన జీవుల్ని మరలా పుట్టించవచ్చా? : శాస్త్ర పరిశోధనలు రోజు రోజుకు విస్తృతం అవుతున్న నేపథ్యంలో అంతరించిన జీవుల్ని మళ్లీ పుట్టించడం సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయంలో ప్రపంచ ప్రఖ్యాత కోలోసెల్‌ బయోసైన్సెస్‌ పరిశోధనలు మొదలుపెట్టింది. మొదటిగా 1936 లో అంతరించి పోయిన చివరి టాస్మేనియన్‌ టైగర్‌ యొక్క భద్రపరిచిన డీఎన్‌ఏను క్లోనింగ్‌ చేశారు. అయితే, ఆ డీఎన్‌ఏ కొంచెం పాడవడంతో జీనోమ్‌ ఎడిటింగ్‌ చేసి, దాన్ని మరొక జీవిలో పెట్టి టాస్మేనియన్‌ టైగర్‌ను తిరిగి భూమ్మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కోలోసెల్‌ బయోసైన్సెస్‌ పేర్కొంది అయితే దీనికి అంతరించిన జీవుల డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ తెలియాలి. అది తెలిస్తేనే ఇది సాధ్యమవుతుది. కారణమేంటంటే ప్రతి జీవికీ ప్రత్యేకమైన డీఎన్‌ఏ ఉంటుంది. ఆ డీఎన్‌ఏ జీవితకాలం 521 ఏండ్లు. అంటే ప్రతి వెయ్యేండ్లకు దాదాపు 75శాతం జీవుల డీఎన్‌ఏ అంతమవుతుంది.
దీన్నిబట్టి ప్రతి 6.8 మిలియన్‌ ఏండ్లకు ఒక జాతిలోని ప్రతి ఒక్క జీవి డీఎన్‌ఏ కూడా పూర్తిగా అంతరిస్తుంది. అందువల్ల ఎప్పుడో 6.7 మిలియన్‌ ఏండ్ల కిందట అంతరించిన డైనోసార్స్‌ లాంటి జీవుల్ని మళ్లీ పుట్టించడం లేదా సృష్టించడం అసాధ్యం. కానీ, సుమారు వందేండ్ల కిందట అంతరించిన ‘డోడో’ పక్షిని మళ్లీ బతికించొచ్చు. దీన్నే సైంటిస్ట్‌లు డీ-ఎక్టింక్షన్‌ అంటున్నారు. ఇందులో మూడు పద్ధతులు ఉన్నాయి. అవి..
క్లోనింగ్‌: అంతరించిన జీవి డీఎన్‌ఏను క్లోనింగ్‌తో అచ్చం అలాగే తయారుచేయడం. అయితే, దీనికోసం ఆ జీవి డీఎన్‌ఏ సీక్వెన్సింగ్‌ పూర్తిగా తెలియాలి. ఈ మధ్యకాలంలో అంతరించిన జీవులను క్లోనింగ్‌ పద్ధతిలో మళ్లీ పుట్టించొచ్చు. అలాగే, భవిష్యత్తులో అంతరించే ప్రమాదం ఉన్న జీవుల డీఎన్‌ఏను తీసుకొని మళ్లీ వాటిని సృష్టించొచ్చు.
జీనోమ్‌ ఎడిటింగ్‌: ఈ పద్దతిలో అంతరించిన జీవుల డీఎన్‌ఏను పోలి ఉండే డీఎన్‌ఏను తయారుచేయడం. దీనికోసం.. అంతరించిన జీవులను పోలి ఉండే జీవుల జీనోమ్‌ను మార్పు చేయాలి. ఆ డీఎన్‌ఏతో మళ్లీ పాత జీవిని పుట్టించొచ్చు. అయితే, ఈ పద్ధతిలో పుట్టేవి హైబ్రీడ్‌ జాతిగా మాత్రమే గుర్తింపు పొందుతాయి.
బాక్‌ – బ్రీడింగ్‌: ఏదైనా అంతరించిపోయిన జీవికి చెందిన అండాన్ని లేదా గుడ్డును అచ్చం అలాంటి పోలికలో ఉన్న మరొక జీవిలో ప్రవేశపెట్టి కొత్త వాటిని పుట్టించడం. అయితే, జీనోమ్‌ ఎడిటింగ్‌లా ఇందులోనూ అంతరించిపోయిన జీవి లక్షణాలను పోలి ఉండే మరొక జీవి కావాలి. అయితే జీవులు అంతరించిన తరువాత మరలా వాటి పునర్జన్మ కై పరిశోధనలు చేసి కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కన్నా సహజ ప్రక్రియలో సృష్టింప బడిన జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలిగితే ప్రకృతికి మేలు చేయడమే కాకుండా మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. మన మనుగడకు ప్రమాదం లేకుండా జీవించగలుగుతాం. రాబోయే తరాల వారికి అవకాశం కల్పించిన వారం అవుతాం.
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నేటి పరిస్ధితులు గమనిస్తే జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడానికి భూతాపం ప్రధాన కారణమై నిలిచింది. దీనికి అభివృద్ధి చెందిన దేశాల పారిశ్రామిక విధానమే కారణం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రమాదం ముంచుకు వచ్చి జీవ వైవిధ్య పరిరక్షణ బాధ్యతలు చేపట్టే సమయం వచ్చే సరికి వర్ధమాన దేశాలు బాధ్యత వహించాలని చెప్పడం మొదలు పెట్టాయి. ఒకవేళ వర్ధమాన దేశాలు ఈ బాధ్యత చేపట్టడానికి ముందుకు వస్తే ఇప్పటి వరకూ జీవవైవిధ్య నష్టతకు వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా నిలచిన అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాలకు ఆర్ధికంగా, సాంకేతంగా పూర్తి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత్‌ తో పాటు ఇతర మూడవ ప్రపంచ దేశాలు ఈ డిమాండ్‌ ను తెరపైకి తీసుకురావడాన్ని వర్ధమాన దేశాలన్నీ కలసి సమిష్టిగా సమర్ధించవలసిన సమయం నేడు ఆసన్నమయ్యింది.
ప్రస్తుతం నెలకొన్న ప్రమాదకర పరిస్ధితులలో సత్వరమే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోకపోతే 2050 నాటికి ఊహకందని విపరీత పరిణామాలెన్నో చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భారత్‌ చర్యలు : అంతర్జాతీయ జీవ వైవిధ్య ఒడంబడికలో భారత్‌ సభ్య దేశంగా ఉంది. దీనిని అనుసరించి 2002లో మన దేశం అట్టహాసంగా జాతీయ జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి, చట్టాన్ని రూపొందించుకున్నాం. అయితే వాస్తవంలో దీనిని అమలు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తి అలసత్వం ప్రదర్శిస్తున్నాయనే చెప్పవచ్చు. ప్రజలకు జీవ వైవిధ్యం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాలు నామ మాత్రంగా అక్కడక్కడ ఏర్పాట్లు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. పర్యావరణ మరియు జీవ వైవిధ్య పరిరక్షణ మొదలైన అంశాల విషయంలో విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి పాఠ్యాంశాలలో వీటిని చేర్చినప్పటికీ అది తూతూమంత్రంగా అవగాహన కల్పిస్తూ జరిపి పరీక్షలు నిర్వహిస్తున్నాం. అందుకే చాలా మంది విద్యాధికులలో కూడా జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన ఉండటం లేదు. ఈ విషయంలో 1986 పర్యావరణ పరిరక్షణ, 1980 అటవీ పరిరక్షణ, 1981 వాయు కాలుష్య నియంత్రణ, 1974 జల కాలుష్య నియంత్రణ, 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టాల్లాంటివి మన దేశంలో ఎన్ని వచ్చినా.. దేశంలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. జీవ వైవిద్యానికి ముప్పు పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని గమనించిన సుప్రీం కోర్టు ప్రభుత్వాలను ఎన్నో సందర్భాలలో హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. ఒక పక్క అడవులు తరిగి పోతున్నాయి. మరొక పక్క వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. ముప్పు పొంచి ఉందని భయపడుతున్నాం కానీ దాని కట్టడి చేసే విషయంలో మన విధులను మనం నిర్వర్తించలేక పోతున్నాం.
కాపాడుకోవడం మన బాధ్యత
జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడుతున్న వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాలి. సామాజిక అడవుల పెంపకాన్ని పర్యావరణ వేత్తలు ఉద్యమంలా చేపట్టాలి. ప్రభుత్వం పర్యావరణ సంబంధిత శిక్షణా కార్యక్రమాలు తరచూ ఏర్పాటు చేస్తూ జీవ వైవిధ్య అవశ్యకతను తెలియజేయాలి.
జానపద కళలు, వీధి నాటకాల ద్వారా ప్రజల్లో జీవవైవిధ్యం పట్ల అవగాహన కలిగించాలి. సామాజిక మాధ్యమం, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా వినూత్న శైలిలో జనాలకు సులభతరమైన భాషలో సరళంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలి.
పర్యావరణ, జీవ వైవిధ్య పరిరక్షణ విషయంలో ప్రపంచ దేశాలు అనేక అంతర్జాతీయ ధరిత్రీ సదస్సులు ఏర్పాటు చేసి కార్యాచరణ అమలుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికి భూతాపం, అనావృష్టి, అతివృష్టి, అకాల వర్షాలు, వరదలు, కరవు తదితరాలు ఇటీవలి కాలంలో ఇంకా అధికమవుతూనే ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే లక్ష్యాల సాధనకు కార్యాచరణకు పొంతన లేదనే విషయం తెలుస్తుంది. కనుక వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులను జాగ్రత్తగా గమనిస్తూ కార్యాచరణను సత్వరమే చేపట్టాలి. ప్రకృతి అందించిన జీవ వైవిధ్య సంపదను కాపాడుకోవడం ఆధునిక మానవుడి ప్రాధమిక బాధ్యత అని గుర్తెరగాలి.
మన రాజ్యాంగం అధికరణం 48(ఏ) లో పర్యావరణ పరిరక్షణకు.. అభివృద్ధికి, ప్రభుత్వం కృషి చేయాలి. దేశంలోని వనాలను, వన్యప్రాణులను కాపాడడం రాజ్య విధి అని ఆదేశిక సూత్రాల్లో చెప్పింది. అంతేకాదు పర్యావరణ రక్షణ పౌరుల ప్రాథమిక విధి అని 51 ఏ(జి) లో స్పష్టంగా పేర్కొంది. అంటే పౌరులుగా మనం జీవ వైవిధ్య పరిరక్షణ మన ప్రాధమిక బాధ్యత అనే విషయం గుర్తించిన నాడు జీవ వైవిద్యానికి జరిగే నష్టత అరికట్టబడుతుంది.
ఎందుకంటే అంతరించి పోయిన వృక్ష, జంతుజాలాన్ని ఎప్పటికీ పునరుద్ధరించుకోలేం. ఏ జీవి అయినా తనకు తానుగా స్వతంత్రంగా మనుగడ సాగించలేదు. తప్పనిసరిగా ఇతర జీవుల మీద ఆధారపడాల్సిందే. ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించి ఇప్పటికైనా పరిరక్షణ దిశగా అడుగులు వేయగలిగితే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. దీనివలన ప్రస్తుత తరం వారమైన మనం ప్రయోజనం పొందటమే కాకుండా రాబోయే తరాల వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కొనసాగించే అభివృద్ధికి అవకాశం అందించిన వారం అవుతాం.

Spread the love