Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'హెచ్‌పీవీ'పై అనాసక్తి..!

‘హెచ్‌పీవీ’పై అనాసక్తి..!

- Advertisement -

మార్చి 8న వ్యాక్సినేషన్‌ ప్రారంభం ొ టార్గెట్‌ 45,839.. తీసుకున్నది 700 మందే..
అంతగా ఆసక్తి చూపని తల్లిదండ్రులు ొ వ్యాక్సిన్‌ వేయించాల్సిన బాధ్యత వారిదే..
నవతెలంగాణ-సిటీబ్యూరో

గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ను నివారించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉచితంగా ‘హెచ్‌పీవీ’ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌) టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందించేం దుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందుకు హైదరాబాద్‌ జిల్లావ్యాప్తంగా 45,839 మంది కిశోర బాలికలు ఉన్నట్టు గుర్తించి.. జిల్లాలోని 15 టీవీవీపీ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, డీఎంఈ పరిధిలోని గాంధీ, నిలోఫర్‌ ఆస్పత్రులు, 91 యూపీహెచ్‌సీల(అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు)లో టీకాలను అందుబాటులో ఉంచారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ తీసుకోవడానికి బాలికలు ఆనాసక్తి చూపుతున్నారు. 40 రోజులు దాటినా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 700 మంది మాత్రమే టీకాలు తీసుకున్నారు.

45,839 మంది కిశోర బాలికలు
భవిష్యత్‌లో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రభుత్వం హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ వేస్తోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు జిల్లాలో 14-15 ఏండ్ల బాలికలు 45,839 మంది ఉన్నట్టు గుర్తించి టీకాలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ టీకాలు తీసుకునేందుకు బాలికలు ముందుకు రావడం లేదు. బాలికలకు టీకాలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.. కానీ, మార్చి 8న ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 40 రోజులు గడిచినా ఇప్పటి వరకు 700 మంది మాత్రమే టీకా తీసుకున్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 2శాతం శాతం కూడా లక్ష్యం చేరుకోలేదు. బాలికల్లో సరైన అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. ప్రస్తుతం వేసవి సెలవులు కూడా ఉండటంతో బాలికలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

మరింత అవగాహన కల్పిస్తేనే..

మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా రొమ్ము, సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్లు ఉంటున్నాయి. ఇందులో సర్వైకల్‌ క్యాన్సర్‌కు సంబంధించి సరైన అవగాహన లేకనే వ్యాధికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. కిశోర బాలికల్లో హార్మోన్ల మార్పులు జరుగుతున్న సమయంలోనే ఇన్‌ఫెక్షన్లు వచ్చి క్యాన్సర్‌గా మారేందుకు అవకాశం ఉందని గుర్తించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అనేది ముత్ర విసర్జన అనంతరం శుభ్రతను పాటించక పోవడం వల్ల, క్యాన్సర్‌ వచ్చిందని గుర్తించడంలోనూ జరుగు తున్న జాప్యం వల్ల వ్యాధి బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం చదువుకునే బాలికలకే కాకుండా, చదువుకు దూరంగా ఉన్నవారిని సైతం గుర్తించి వ్యాక్సిన్‌ వేస్తే సర్వైకల్‌ క్యాన్సర్‌ పూర్తిగా రాకుండా నిరోధించేందుకు అవకాశం ఉంది. గర్భాశయ క్యాన్సర్‌ కేసులకు కారణమైన హైరిస్క్‌ రకాల హ్యూమన్‌ పాపి ల్లోమావైరస్‌ (హెచ్పీవీ), గర్భాశయ క్యాన్సర్‌ ఒకటి కాగా, ఈ వ్యాక్సిన్‌ వల్ల హెచ్‌పీవీ టైప్‌ 16, 18తోపాటు, టైప్‌ 6, 11 రకాల నుంచి కూడా ప్రస్తుతం వేస్తున్న టీకా రక్షణ కల్పిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 14-15 ఏండ్ల బాలికలందరికీ ఈ వ్యాక్సిన్‌ ఉచితంగా చేస్తున్నారు.

వ్యాక్సిన్‌తో ప్రయోజనాలెన్నో..
హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. మహిళలు కొన్ని సందర్భాల్లో ఇన్‌ఫెక్షన్ల బారినపడి వాటిని గుర్తించలేకపోతారు. సుదీర్ఘ కాలంగా చికిత్స చేయించుకోక పోవడంతో అది కాస్తా క్యాన్సర్‌కు దారితీసే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా మహిళలు అనారోగ్యం బారిన పడు తుంటారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ అన్ని ప్రభుత్వా స్పత్రుల్లో అందుబాటులో ఉంది. ఇదే వ్యాక్సిన్‌ బయట ప్రయివేటు ఆస్పత్రు ల్లో కూడా అందుబాటులో ఉండగా.. ఒక్క టీకా సుమారు రూ.5 నుంచి రూ.10వేల వరకు ఉంటుంది. ఉచితంగా అందుబాటులో ఉన్న టీకాలను సద్విని యోగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి
కిశోర బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ టీకాలు తీసుకుంటే భవిష్యత్‌లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌ ముప్పు ఉండదు. ఈ వేసవి సెలవుల్లోనూ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. సర్వైకల్‌ క్యాన్సర్‌ మన దేశంలోని మహిళల్లో అతి పెద్ద రెండో క్యాన్సర్‌. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశాం.

  • శ్రీధర్‌, ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌, హైదరాబాద్‌ జిల్లా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -