ఈ నెలాఖరులోగా నిర్ణయం • అటవీ భూములకు సరిహద్దులు నిర్ణయిస్తాం • రోవర్లతో సర్వే చేయిస్తాం
• జూన్ 2న రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు • కేంద్ర వాటా కోసం ఎదురుచూస్తున్నాం
• ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది : రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని భూముల ధరలను ఈనెలాఖరులోగా పెంచుతామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భూముల ధరలను సవరించి అమల్లోకి తెస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022లో ఆర్నెల్లు తిరగకుండానే రెండు సార్లు భూముల ధరలను అశాస్త్రీయ పద్దతిలో పెంచిందని గుర్తు చేశారు.జూన్ రెండున రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను మంజూరు ప్రారంభిస్తామని వివరించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పధకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని అన్నారు. కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు రూ.1.13 లక్షల వాటా విడుదల చేయాల్సి ఉందని వివరించారు. కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్దిదారులకు తుది విడత బిల్ ఆపామని అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశానని గుర్తు చేశారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోవైపు ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి రూ.1.60 లక్షలు తాత్కాలికంగా ఆపామని వివరించారు. ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిధులను భరించి లబ్దిదారులకు అందజేస్తుందని స్పష్టం చేశారు.రాష్ట్రంలో తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని చెప్పారు. జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్‌ల నిర్మాణం పూర్తవుతుందన్నారు.
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పధకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ రెండున ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని చెప్పారు. గోడలు, బేస్‌మెంట్ లెవెల్, శ్లాబ్ వరకు ఉన్న గోడలు, శ్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈనెల 21న క్యాబినెట్‌లో చర్చించి ప్రకటిస్తామని అన్నారు. ఈ సారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించామని మంత్రి పొంగులేటి చెప్పారు. సరిహద్దులను కచ్చితంగా ఖరారు చేసేలా ఆదేశించామన్నారు. 1/70 సమస్యపై కూడా చర్చించామని అన్నారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ సరిహద్దు వివాదాలు ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి ఉమ్మడి సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపబోతామన్నారు.
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతామని అన్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. మారు రూ.14.08 కోట్లతో టెండర్ ఖరారు అయిందన్నారు. మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి పాతరేట్లతో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను కోరామన్నారు. అత్యధిక శాతం ఈ పనుల పూర్తికి ముందుకు రానందున లబ్దిదారులను ఎంపిక చేసి వారికే మిగిలిన మొత్తాన్ని ఇస్తూ వారిచేతనే పూర్తిచేయించేలా నిర్ణయించామని అన్నారు. ఈనెలాఖరులోగా ఇటువంటి ఇండ్లను గుర్తించేలా కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.
పలు ప్రాంతాల్లో పదికిపైగా ఇండ్లు కలిగిన టవర్లను గుర్తించి వాటికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తూ, వాటి దిగువ కమర్షియల్ షాపులను లీజుకు బదులు పూర్తిగా బహిరంగ వేలంలో విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ప్రాతినిధ్యం కలిగిన పాలక వర్గాల అకౌంట్‌లో వేయాలని నిర్ణయించామని మంత్రి పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 38 వేల డబూల్ బెడ్రూం ఇండ్లకు లబ్దిదారులను ఖరారు చేసిందన్నారు. తాము సర్వే నిర్వహిస్తే వారిలో సుమారు 16వేల మంది ఆ ఇండ్లలోకి వెళ్లలేదని చెప్పారు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయించాలని నిర్ణయించామని అన్నారు. అర్హులను ఎంపిక చేసి యుద్ధ ప్రాతిపదికన కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. జీహెచ్ ఎంసీ పరిధిలో మూడు కార్పొరేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని అన్నారు.
ఒకే స్ధలంలో అన్నదమ్ములు ఇందిరమ్మ ఇండ్లను వన్ ప్లస్ వన్ పద్దతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. సుమారు 40-50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే,ఎన్ ఆర్ జే ఎ ఎం ఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలిపోయే స్ధితికి చేరుకుంటున్నాయనీ, వాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు పరిశీలిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లబ్దిదారులు స్ధానికంగా ఇసుకను ఉచితంగా పొందేలా, ఎర్త్ ఫిల్లింగ్‌కు కూడా మట్టిని పొందేలా అవకాశం ఇవ్వాలని, ఎటువంటి అభ్యంతరాలు తెలుపకూడదని అధికారులను ఆదేశించామన్నారు. గతంలో ప్రయివేటు భూములను సేకరించి ఇండ్ల నిర్మాణానికి లేఅవుట్‌లు వేశారని అన్నారు. వాటిలో కొన్ని ఖాళీగా ఉన్నాయనీ, మరికొన్ని చోట్ల కబ్జాకు గురయ్యాయని వివరించారు. ధరణి కారణంగా గతంలో భూమి అమ్మిన వ్యక్తి పేరిటే మళ్లీ భూమి ఉన్నట్టు రావడంతో సమస్యలు మొదలయ్యాయని అన్నారు.
ఇటువంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కబ్జాదారులను, ప్రభుత్వ భూమిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైన చోట ప్రభుత్వ భూములకు ప్రహారీతో రక్షణ కల్పిస్తామన్నారు. పాలేరు నియోజకవర్గాన్ని 20 వేల ఓటర్ల చొప్పున 14 క్లస్టర్‌లుగా విభజించి ఇప్పటి వరకు 13 క్లస్టర్లలో ప్రజా దర్బార్ నిర్వహించామని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా 52 శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఉన్నాయని వివరించారు. తర్వాత స్ధానంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, గృహలక్ష్మి, గ్యాస్ సబ్సిడీ, రేషన్ కార్డులలో కుటుంబీకుల పేర్ల చేర్పు వంటివి ప్రాధాన్యతా క్రమంలో ఉన్నాయని అన్నారు. ఆసరా పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కచ్చతమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.



