బీసీ అభ్యర్థులను గెలిపించుకుందాం

– బీసీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్‌ పరిధిలో బరిలో ఉన్న బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించుకుని పార్లమెంటుకు పంపే విధంగా బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ ద్వారా ముందుకెళ్తున్నట్టు బీసీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. బీసీ సమాజ్‌ చాలా రోజులుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కుల సంఘాలు, ప్రజా సంఘాల ద్వారా ‘మన ఓటు మనమే వేసుకుందాం’ అనే నినాదంతో ముందుకెళ్తూ పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బరిలో నిలిచిన బీసీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులుగా రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వారిని బరిలో నిలిపారనీ, అక్కడ ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి తమ సంఘాల ద్వారా, అన్ని మండల కేంద్రాల్లో పని చేస్తూ బీసీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు. అన్ని ప్రధాన పార్టీలకు బీసీ జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీలకు పార్లమెంట్‌ సీట్లు కేటాయించాలని చాలా సందర్భాల్లో ఆయా పార్టీల అధ్యక్షులకు లేఖల ద్వారా కోరినట్టు తెలిపారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్‌, భువనగిరి నుంచి బూరనర్సయ్యగౌడ్‌, కరీంనగర్‌ నుంచి బండి సంజరు, నిజామాబాద్‌ నుంచి ధర్మపురి అరవింద్‌, మెదక్‌ నుంచి నీలం మధు ముదిరాజ్‌, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, సికింద్రాబాద్‌ నుంచి పద్మారావుగౌడ్‌, హైదరాబాద్‌ నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌కు బీసీ సమాజ్‌ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీ సమాజ్‌ రాష్ట్ర కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడాల శ్రీనివాస్‌సాగర్‌, యువజన నాయకుడు నల్లతీగల రాజు, హైదరాబాద్‌ జిల్లా నాయకులు మానేకర్‌ విజరుకుమార్‌, జల్లి సావంత్‌ గిరి మందుల, తదితరులు పాల్గొన్నారు.

Spread the love