సవరించిన రాజ్యాంగ పీఠికనే వాడదాం

– పదో తరగతి సాంఘికశాస్త్రం పాఠ్యపుస్తకాలపై దాన్ని అతికించాలి
– డీఈవోలకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ రాధారెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సవరించిన రాజ్యాంగ పీఠికనే వాడతామంటూ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) స్పష్టం చేసింది. దాన్ని డౌన్‌లోడ్‌ చేసి డీఈవోలకు పంపించామని తెలిపింది. పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీపై దాన్ని అతికించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి తెలుగు, ఆంగ్ల మాధ్యమం సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీపై రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం, లౌకిక పదాల్లేకుండా ముద్రించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో డైరెక్టర్‌ స్పందించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలకు కొత్తగా డిజైన్‌ రూపొందించామని ఆమె తెలిపారు. అయితే పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లోని కవర్‌ పేజీపై పాత రాజ్యాంగ పీఠికను డౌన్‌లోడ్‌ చేసి కొత్త డిజైన్‌ చేసి ముద్రించారని పేర్కొన్నారు. సవరించిన రాజ్యాంగ పీఠికను డౌన్‌లోడ్‌ చేశామని తెలిపారు. దాన్ని పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీపై అతికించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవో) ఈ ఆదేశాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలలకు హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లకు సవరించిన రాజ్యాంగ పీఠికను పంపించి ఆ పాఠ్యపుస్తకాల కవర్‌ పేజీపై అతికించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత నివేదికను వెంటనే ఎస్‌సీఈఆర్టీకి పంపించాలని కోరారు.

Spread the love