మేడిపాటి మౌనం వీడేనా?

 – బీజేపీ టికెట్ రాకపోవడంతో అలక!
– మచ్చిక కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రయత్నాలు…
– బీజేపీ అభ్యర్థి నామినేషన్ కు హాజరయ్యేనా?
నవతెలంగాణ – నవీపేట్: బోధన్ బీజేపీ టికెట్ కోసం ఆశపడిన మేడిపాటి ప్రకాష్ రెడ్డికి చివరికి టికెట్ దక్కకపోవడంతో అలక వహించినట్టు తెలుస్తోంది. బోధన్ బీజేపీ టికెట్ మేడిపాటి ప్రకాష్ రెడ్డికే దక్కుతుందని గత కొన్ని రోజులు జోరుగా ప్రచారం జరిగిన చివరికి అధిష్టానం వడ్డీ మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించింది. టికెట్ కేటాయింపు అనంతరం వడ్డీ మోహన్ రెడ్డి మేడిపాటి ప్రకాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నా నవీపేట్ మండల కేంద్రంలో నవీపేట్, ఎడపల్లి, రెంజల్ బూత్ స్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశానికి మేడిపాటి ప్రకాష్ రెడ్డి హాజరు కాకపోవడంతో అలక వహించారని రాజకీయంగా చర్చ జరుగుతోంది. త్వరలోనే మేడిపాటి ప్రకాష్ రెడ్డితో కలిసి రామ్ లక్ష్మణుడి లాగా తిరిగి కాషాయ జెండా బోధన్ లో ఎగిరేస్తామని వడ్డీ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మేడిపాటిని మచ్చిక చేసుకునేందుకు రాష్ట్రస్థాయి నాయకులతో ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదో ఒక పార్టీకి మద్దతు తెలిపితే బోధన్ లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. 9వ తేదీ గురువారం బీజేపీ అభ్యర్థి వడ్డీ మోహన్ రెడ్డి తన బలగంతో కలిసి నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తుండగా మేడిపాటి ప్రకాష్ రెడ్డి కూడా హాజరయ్యేనా అని కార్యకర్తల్లో సందేహం నెలకొంది.

Spread the love