కెెప్టెన్‌ లక్ష్మి సెహగల్‌ జీవితం

– స్ఫూర్తిదాయకం : సుభాషిణీ అలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణీ అలీ అన్నారు. సెహగల్‌ 11వ వర్థంతి సందర్భంగా ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వయంలో ‘ఆజాదీ – కెప్టెన్‌ లక్ష్మి సెహగల్‌ పోరాటం, దృక్పథం’ అంశంపై నిర్వహించిన వెబినార్‌లో సుభాషిణీ అలీ మాట్లాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆమె తెగబడి పోరాడారని తెలిపారు. నేతాజి సుభాష్‌ చంద్రబోస్‌ సైన్యంలో ఝాన్సీ కా రాణీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేసి పాల్గొన్నారని గుర్తుచేశారు. లక్ష్మీ సెహగల్‌తో పాటు స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది మహిళలు పోరాడారనీ, వారందరినీ స్మరించుకోవాలని సూచించారు. 1940లో వైద్యవిద్యను అభ్యసించిన లక్ష్మీ, బ్రిటీష్‌ పాలకులు విధించిన షరతు (స్వదేశంలో అయినా సరే…లేదా బ్రిటీష్‌ వలస పాలనలో ఉన్న దేశాల్లో అయినా సరే కచ్చితంగా బ్రిటీషర్ల ఆస్పత్రుల్లోనే పని చేయాలి)ను ఇష్టపడలేదని తెలిపారు. దీంతో సింగపూర్‌లో, తన వైద్య వృత్తిని కొనసాగించారని వివరించారు.
కాన్పూర్‌లో స్థిరపడ్డ లక్ష్మీ సెహగల్‌ జీవితకాలం హిందూ, ముస్లీం ఐక్యత కోసం నిలబడ్డారని చెప్పారు. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ కాన్పూర్‌కు రావడం, నేతాజీని తీవ్రంగా విమర్శించాల్సిన అవసరం లేదనడం, బంగ్లా సరిహద్దుల్లో వైద్య సేవల కోసం జ్యోతిబసు ఆమెను ఆహ్వానించడం తదితర పరిణామాలతో పాటు అక్కడ సీపీఐ(ఎం) కార్యకర్తల సేవా నిబద్దతను చూశాక 57 సంవత్సరాల వయస్సులో పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారని గుర్తుచేశారు. 1981లో ఐద్వా ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఆ సంఘానికి ఉపాధ్యక్షురాలిగా సేవలందించారని సుభాషిణీ అలీ చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో సిక్కులపై ఊచకోత సమయంలో కాన్పూర్‌లో అలాంటి దాడి జరగకుండా అడ్డుగా నిలిచిన ధైర్యవంతురాలు లక్ష్మీసెహగల్‌ అని తెలిపారు. ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచిన సమయంలో ఆమె కాళ్లు మొక్కేందుకు నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ జోషి ప్రయత్నిస్తే, రక్తం తాకిన చేతులతో తన కాళ్లు ముట్టుకోవద్దంటూ బహిరంగ సభలో చెప్పిన ధీర వనిత సెహగల్‌ అని కొనియాడారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోరాట మార్గం ఎంచుకున్న ఆమె తాను బతికిన 97 ఏండ్లూ అదే బాటలో పయనించారని తెలిపారు.

Spread the love