రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
– బంగాళాఖాతంలో అల్పపీడనం
– రాష్ట్రంలో 769 ప్రాంతాల్లో వర్షపాతం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ వద్ద కొనసాగుతున్నది. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఏర్పడిన అవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. రాబోయే రెండు రోజుల్లో దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరం వెంబడి వెళ్లే అవకాశముంది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు 769 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా లోకారి(కె)లో అత్యధికంగా 8.48 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 7.7 సెంటీమీటర్లు, ఆదిలాబాద్‌ జిల్లా చాప్రాలలో 7.45 సెంటీమీటర్లు, ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో 6.7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది.

Spread the love