– తెరవే రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దే ఉన్నతమైన శక్తి సాహిత్యానికే ఉందని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి అన్నారు. కామారెడ్డిలోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాల సెమినార్ హాలులో తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్ఫూర్తి శిఖరం” పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రచయిత శ్యామ్ కుమార్ రచించిన “స్ఫూర్తి శిఖరం” పుస్తకంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ . పి . జె . అబ్దుల్ కలం ఆదర్శాలను కవితల రూపంలో అద్భుతంగా మలిచారని కొనియాడారు.
ఈ పుస్తకం ముఖ్యంగా యువత వ్యక్తిత్వ వికాసానికి కరదీపికగా ఉపయోగపడుతుందని, జీవితంలో లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగేందుకు ఎన్నో స్ఫూర్తిదాయక అంశాలను అందిస్తుందని తెలిపారు. ఐఎస్‌బీఎన్ సర్టిఫికెట్ పొందిన ఈ పుస్తకంలో విద్యార్థులు, యువతతో పాటు సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడే సూచనలు, సలహాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి యువకుడి విజయానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని, ప్రతి ఒక్కరి వద్ద ఉండదగిన గ్రంథమని అన్నారు. ఈ సభకు అధ్యక్షత వహించిన గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ యువకులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. రచయిత శ్యామ్ కుమార్ ప్రతి రచనలో కొత్తదనాన్ని కలగలిపి అందిస్తున్నారని ప్రశంసించారు.
ప్రముఖ వ్యాఖ్యాత అంబీర్ మనోహర్‌రావు మాట్లాడుతూ “స్ఫూర్తి శిఖరం”లో ఎన్నో ఆలోచనాత్మక పదాలు ఉన్నాయని తెలిపారు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ యువత స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, బైండ్ల సుదర్శన్, తెరవే ప్రధాన కార్యదర్శి మోహన్ రాజ్, నాగభూషణం, సిద్ధిపేట జిల్లా తెరవే అధ్యక్షుడు మహిమూద్ భాష, ప్రధాన కార్యదర్శి పరకపల్లి యాదగిరి, సింగర్ సంధ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.



