రుణాల్లేవ్‌… దరఖాస్తుల్ని పట్టించుకోరు !

– చిన్నబోతున్న ‘కుటీర పరిశ్రమలు’
– ప్రోత్సాహకాలు లేక నిర్వాహకుల ఇక్కట్లు
– ప్రయివేట్‌ అప్పులతో ఆర్థికభారం
– సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ – శాయంపేట
పక్క ఫొటోలో కన్పిస్తున్న మహిళ పేరు దాసరి కల్పన. హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్ర వాసి. పర్యావరణ పరిరక్షణ కోసం మాన్‌ ఓవెన్‌ బ్యాగ్‌ (జ్యూట్‌ బ్యాగ్‌) లు తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి సిద్ధపడింది. డీఆర్‌డీఏ అధికారులు కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తామని, సబ్సిడీ రుణాలు అందజేస్తామని ఆర్భాట ప్రకటనలు చేస్తుండడంతో పరిశ్రమ నెలకొల్పడానికి రుణాలకు దరఖాస్తు చేసుకుంది. అధికారులు స్పందించకపోవడంతో తన దగ్గరున్న రూ.10 లక్షలతోపాటు, మరో రూ.10 లక్షలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పు తెచ్చి రూ.20 లక్షలతో హైదరాబాద్‌ డీలర్‌ వద్ద జ్యూట్‌ బ్యాగుల తయారీ పరిశ్రమ నెలకొల్పింది. జ్యూట్‌ బ్యాగుల తయారీ ముడిసరుకు చెన్నై నుండి ఆర్డర్‌ పై తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది.
మహిళల స్వయం సమద్ధి కోసం కుటీర పరిశ్రమలు నెలకొల్పుకుంటే సబ్సిడీ రుణాలు అందజేస్తామని డీఆర్డీఏ అధికారులు ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నారే తప్ప ఆచరణలో ఎక్కడా కూడా అమలు చేయని పరిస్థితి. వేడినీళ్ళకు చన్నీళ్లు తోడు అన్న చందంగా స్త్రీ నిధి నుండి రూ.3 లక్షల రుణం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నా అధికారులు మొండి చేయి చూపుతున్నారు. గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పరిశ్రమ నెలకొల్పి పర్యావరణ పరిరక్షణ కోసం జ్యూట్‌ బ్యాగులు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కాగా జూట్‌ బ్యాగులతో పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించడం వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం వాటిల్లుతోందని, జూట్‌ బ్యాగులు వినియోగించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
స్త్రీనిది రుణాలు చెల్లించడంలో మొండి చేయి : కల్పన, మహిళ
జూట్‌ బ్యాగుల తయారీ పరిశ్రమకు సబ్సిడీ రుణాలు అందకపోవడంతో, ముడి సరుకుల కోసం స్త్రీ నిధి నుండి 3 లక్షల రుణాలు చెల్లించాలని నవంబర్‌ 17న ఐకెపి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా. అధికారులు చెప్పిన అన్ని రకాల పత్రాలతో దరఖాస్తు చేశా. ఇప్పటివరకు రుణం మంజూరు చేయలేదు. పరిశ్రమ నెలకొల్పగానే డీఆర్‌డీఏ అధికారులు, డీపీఎం అనిల్‌ కుమార్‌ సందర్శించి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. రుణాలు మాత్రం ఇప్పించలేదు. అలాగే జ్యూట్‌ బ్యాగుల తయారీ పరిశ్రమ కోసం పీఎంఈజీపీకి దరఖాస్తు చేశా. ఈ పథకంలో 40 శాతం వర్కింగ్‌ క్యాపిటల్‌ ఉండగా, 60 శాతం రుణాలు చెల్లిస్తారు. రూ.10 లక్షల రుణాలు మంజూరు చేసినా తమకు వెసులుబాటు కలుగుతుంది. తక్కువ వడ్డీ కావడంతో పరిశ్రమను అభివద్ధి చేసి మహిళా కూలీలకు కూడా ఉపాధి కల్పించొచ్చు. ఈ పరిశ్రమ ద్వారా కిలో జ్యూట్‌ బ్యాగులు ప్రింటింగ్‌ తో సహా రూ. 220కి సప్లై చేస్తున్నామని, క్యారీ బ్యాగులు కిలో రూ. 200 కు ఆర్డర్‌ పై సప్లై చేస్తున్నట్లు కల్పన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జూటు బ్యాగ్‌ తయారీ కుటీర పరిశ్రమకు సబ్సిడీ రుణాలు అందించి తమకు చేయూతనివ్వాలని కోరుతున్నాం.

Spread the love