కారులో టికెట్ల లొల్లి

– ఉప్పల్‌, అంబర్‌పేట్‌ నియోజకవర్గాల నేతలు బాహాబాహీ
–  ఎమ్మెల్సీ కవిత వద్దకు పంచాయతీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కారులో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉన్నది. తాజాగా హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు గళం వినిపిస్తున్నారు. టికెట్‌ మాకివ్వాలంటే, మాకివ్వాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత వద్దకు పంచాయతీ చేరింది.రెండు రోజులుగా ఉప్పల్‌ ఎమ్మెల్యే టికెట్‌ తనకే కేటాయించాలంటూ బీఆర్‌ఎస్‌ నేత బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ కవితను కలిశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కవిత ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకుకెళతానని వారికి హామీ ఇచ్చారు. అంబర్‌పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ అసమ్మతి గ్రూప్‌ నిరసన తెలిపింది. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఉద్యమకారులు అంతా ఒకతాటిపైకి వచ్చారు. ఇంచార్జి ఎడ్ల సుధాకర్‌ రెడ్డికి లేదా మాజీ కార్పొరేటర్‌ ఎక్కాల కన్నా యాదవ్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమలోని బీసీ నేతకు ఇవ్వాలంటూ కోరారు. తమపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఎక్కాల చైతన్య కన్నా, గరిగంటి శ్రీదేవి రమేష్‌, డిపి పద్మ, పులి జగన్‌, నాయకులు నాగేష్‌గౌడ్‌, మురళీకష్ణ, అశోక్‌ రెడ్డి, అంజమ్మ, సునీత లక్ష్మి, ప్రియతోపాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love