బ్రహ్మణ సదనంలో అద్దెకుకళ్యాణ మండపం

– పేద బ్రాహ్మణులకు ఉచితం
– సంక్షేమ పరిషత్‌ చైర్మెన్‌ రమణాచారి వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కేవీ రమణాచారి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 9 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.12 కోట్ల వ్యయంతో కళ్యాణమండపం, ఆడిటోరియం, సమాచార కేంద్రం, ధర్మాచార్యుల విడిది సదనం నిర్మించామన్నారు. ఇక్కడి కళ్యాణమండపాన్ని మత, ఆచార, సంప్రదాయ, లౌకికపరమైన కార్యక్రమాల నిర్వహణకు కేటాయించినట్టు తెలిపారు. ఇక్కడి కళ్యాణమండపాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద బ్రాహ్మణులకు ఉచితంగా, దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న బ్రాహ్మణులకు రూ.10వేలు, బ్రాహ్మణేతర హిందూ కుటుంబాలకు రూ.50వేలకు అద్దెకు ఇస్తామని వివరించారు. అశుభ కార్యాలకు బ్రాహ్మణ సదనం కేటాయింపబడదని స్పష్టం చేశారు. ఈవెంట్స్‌, ఇతర కార్యక్రమాల నిర్వహణకు నెలరోజుల ముందే బుక్‌ చేసుకోవాలని సూచించారు. పేద బ్రాహ్మణులు తహసీల్దారు కార్యాలయం నుంచి జారీ చేసిన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. శుభకార్యాలు జరిపేందుకు పురోహితులు అందుబాటులో ఉంటారనీ, క్యాటరింగ్‌ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాలనీ, ఇతర వివరాలు brahminparishad.telangana.gov.inవెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

Spread the love