– ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఈనెల 15 నుంచి 17 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ వీర వనితల స్ఫూర్తి యాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి పిలుపునిచ్చారు. శుక్రవారం సత్తుపల్లిలోని రావి వీర వెంకయ్య (ప్రజాసంఘాల భవన్) లో జరిగిన ఆ సంఘ డివిజన్ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ నేల విముక్తి కోసం ప్రాణాలర్పించిన వీరనారీమణుల పోరాట పటిమను, వారి త్యాగాలను నేటి తరానికి చాటిచెప్పడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని భారతి, కృష్ణవేణి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చారిత్రక నేపథ్యమున్న గ్రామాలను కలుపుతూ ప్రత్యేక ‘జీపు జాతా’ను రూపొందించారన్నారు.
పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ పురిటిగడ్డ అయిన జనగామ జిల్లా పాలకుర్తిలో ఈ స్ఫూర్తి యాత్ర 15వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ యాత్ర సాయుధ పోరాటంలో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచిన కడవెండి, పాలకుర్తి వంటి పలు విప్లవ గ్రామాల మీదుగా సాగుతుందన్నారు. పోరాట యోధులు ఆరుట్ల కమలాదేవి స్మారకార్థం కొలనుపాకలో ఉన్న స్థూపం వద్ద ఈ యాత్ర ముగింపు సభ జరుగుతుందని తెలిపారు. 17న జరిగే కొలనుపాక ముగింపు సభలో ఐద్వా జాతీయ నాయకురాళ్లు పాల్గొంటారని తెలిపారు. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ఐలమ్మతో పాటు పోరాడిన వేలాది మంది మహిళా యోధుల వీరగాథలను ఈ యాత్ర యాత్ర ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు.
మహిళలు కేవలం గృహ రంగానికే పరిమితం కాదని, ఆనాడు తుపాకీ పట్టి భూస్వామ్య, నిజాం అణచివేతపై పోరాడారని ఈ యాత్ర ద్వారా మహిళ లోకానికి అవగాహన కల్పించనున్నారని తెలిపారు. వెట్టిచాకిరి, భూస్వాముల దోపిడీ, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరనారీమణులు చూపిన ధైర్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక సత్యాలను కొందరు మతపరమైన అంశాలుగా వక్రీకరించడాన్ని నిరసిస్తూ నిజమైన ప్రజా పోరాట చరిత్రను తెలియజేయడమే ఈ యాత్ర ఉద్దేశన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన పోరాటాల స్ఫూర్తితో నేటి మహిళా హక్కుల పరిరక్షణకు ఏకం కావాలని ఐద్వా నేతలు భారతి, కృష్ణవేణి పిలుపునిచ్చారు. యాత్ర సాగిన ప్రతి గ్రామంలో స్థానిక మహిళలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు ఈ యాత్రకు ఘన స్వాగతం పలకాలని భారతి, కృష్ణవేణి కోరారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు శీలం కరుణ, జాజిరి జ్యోతి, మిట్టపల్లి నాగమణి, రాణిరుద్రమ, భూలక్ష్మి, తిరుమల సరోజినీ, నాయుడు హేమలత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు.



