ఆ జిల్లాల్లో మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌

– 34 శాతం జిల్లాల్లో ఇప్పటికీ ఇదే పద్దతి
– దేశవ్యాప్తంగా 508 జిల్లాల్లో దీనిపై నిషేధం

న్యూఢిల్లీ : మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ నిర్మూలన విషయంలో మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దేశంలోని చాలా జిల్లాల్లో మనుషులు చేతులతో మలమూత్ర విసర్జాలు, మురుగు కాలువలను శుభ్రం చేసే ఈ అమానవీయ విధానం ఇప్పటికీ కొనసాగుతున్నది. సాక్షాత్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధితకారత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక నివేదికే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా మొత్తం 766 జిల్లాలకు గానూ 508 జిల్లాలు మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ రహితంగా ప్రకటించుకున్నాయి. అయితే, మ్యాన్యువల్‌ స్కావెంజర్లుగా ఉపాధిని నిషేధించటం, పునరావాస చట్టం కింద ఈ పద్దతి నిషేధించబడినప్పటికీ భారత్‌లో ఇప్పటికీ దాదాపు 34 శాతం జిల్లాల్లో మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌ ప్రబలంగా ఉండటం గమనార్హం. 2017 నుంచి 2021 మధ్య దేశంలో మొత్తం 330 మంది మ్యాన్యువల్‌ స్కావెంజర్ల మరణాలు చోటు చేసుకున్నాయి. మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంకులు శుభ్రం చేస్తున్న సమయంలో ఈ మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ మరణాలపై కర్నాటక సఫాయి కర్మచారి కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎం. శివన్న కొటే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నాలుగేండ్లలో చనిపోయిన 330 మందిని ఎందుకు మ్యాన్యువల్‌ స్కావెంజర్లుగా పరిగణించలేదని ప్రశ్నించారు. మ్యాన్యువల్‌ స్కావెంజింగ్‌కు వ్యతిరేకంగా గత కొన్నేండ్లుగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఈ అమానవీయ పద్దతిని నిర్మూలించే విషయంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండటం ఆందోళనను కలిగిస్తున్నదని దేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

Spread the love