తయారీ రంగం డీలా

– మూడు నెలల కనిష్టానికి పారిశ్రామికోత్పత్తి
– జూన్‌లో 3.7 శాతానికి తగ్గుదల
న్యూఢిల్లీ : భారత తయారీ రంగం డీలా పడింది. ప్రస్తుత ఏడాది జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) వృద్థి 3.7 శాతానికి పడిపోయి.. మూడు నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం మాసంలో ఇది 5.3 శాతం పెరుగుదలను కనబర్చింది. 2022 జూన్‌లో ఏకంగా 12.6 శాతం వృద్థి నమోదయ్యింది. మే ఐఐపిని 5.2 శాతం నుంచి 5.3 శాతానికి సవరిస్తూ కేంద్ర గణాంకాల శాఖ నిర్ణయం తీసుకుంది. గడిచిన జూన్‌లో తయారీ రంగం ఏకంగా 3.1 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం మాసంలో ఇది 5.8 శాతం పెరిగింది. ”ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన జూన్‌ ఐఐపి 3.7 శాతనికి తగ్గి.. మూడు మాసాల కనిష్టానికి పడిపోయింది. కీలక రంగాలు రాణించలేకపోయాయి.” అని ఇక్రా చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఆదితి నయర్‌ పేర్కొన్నారు. క్రితం మేలో గనుల రంగం ఉత్పత్తి 6.4 శాతంగా ఉండగా.. జూన్‌లో 7.6 శాతానికి పెరిగింది. విద్యుత్‌ రంగం ఉత్పత్తి 4.2 శాతంగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన కాలంలో ఐఐపి 4.5 శాతానికి పరిమితమయ్యింది. గతేడాది ఇదే సమయంలో ఏకంగా 12.9 శాతం వృద్థి నమోదయ్యింది. మొత్తం ఐఐపిలో తయారీ రంగం 77.63 శాతం వాటాను కలిగి ఉంది. అత్యంత కీలకమైన తయారీ రంగం ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడంతో ఆ ప్రభావం పారిశ్రామిక ఉత్పత్తిపై పడింది. ఇటీవలి కాలంలో ప్రజల ఆదాయాలు, పొదుపు స్థాయిలు భారీగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. సంపదను కొద్ది మంది వద్ద పోగబడకుండా చూడటంతో పాటుగా ప్రజల కొనుగోలు శక్తి పెంచడం ద్వారానే పారిశ్రామిక రంగానికి మద్దతు లభించనుంది.

Spread the love