ఆర్థిక ఇబ్బందులతో తాపీ మేస్త్రి ఆత్మహత్య

నవతెలంగాణ – నార్సింగి
ఆరోగ్యం సహకరించక పనికి వెళ్లకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి మనస్తాపంతో తాపీ మేస్త్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్‌ జిల్లా నార్సింగిలో మంగళవారం జరిగింది. ఎస్‌ఐ అహ్మద్‌ మోహిద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన రాకాసి విఠల్‌(52) వృత్తి రీత్యా తాపీ మేస్త్రీ. విఠల్‌, అరుణ దంపతులకు 18 ఏండ్ల వయసు గల కవల పిల్లలు అజరు, అరుణ ఉన్నారు.
కాగా, నాలుగేండ్లుగా కాళ్ల నొప్పులతో బాధపడుతున్న విఠల్‌.. ఆరోగ్యం సహకరించకపోవడంతో పనులకు వెళ్లలేకపోతున్నాడు. ఒక రోజు పనికి వెళ్లినా చాలా రోజుల వరకు నొప్పులతో బాధపడేవాడు. దాంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తన పనులు కూడా చేసుకోలేకపోవడం, పనికి వెళ్ల లేకపోవడంతో కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందాడు. దాంతో సోమవారం రాత్రి 10 గంటలకు పట్టణ శివారులోని సహకార సంఘం భవనం వద్ద నున్న బస్‌ స్టాండ్‌ పైకప్పులోని ఇనుప రాడ్డుకు నైలాన్‌ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని రామాయంపేట ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. మృతుని భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Spread the love