10 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ?

Mega DSC with 10 thousand teacher posts?– కాంగ్రెస్‌ సర్కారు సమాలోచన
– ఆర్నెల్లలో భర్తీ చేసేందుకు ప్రణాళిక
– గవర్నర్‌ ప్రసంగంలోనూ హామీ
– 5,089 పోస్టులతో డీఎస్సీ వేసిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
– మరో 5 వేల ఖాళీలు అదనంగా చేర్చే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నది. దీంతో నిరుద్యోగులు ఖాళీల భర్తీకి తీసుకుంటున్న చర్యలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. నోటిఫికేషన్ల విడుదల, వాయిదా పడిన రాతపరీక్షల తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. ‘అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తొలి మంత్రివర్గ సమావేశంలోనే మెగా డీఎస్సీని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఆర్నెల్లలో భర్తీ చేస్తాం.’అని కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పై నమ్మకంతో ఆ పార్టీకి నిరుద్యోగ యువకులు అండగా నిలిచారు. ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడొస్తుందా?అని నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నది. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉపాధ్యాయ ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతికుమారి అడిగి తెలుసుకున్నారు. దీంతో నిరుద్యోగ యువతలో మరింత ఆసక్తి పెరిగింది.
రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జిల్లాస్థాయి నియామక కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్‌ ఆరో తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. 5,089 ఉపాధ్యాయ పోస్టులకు 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అయితే మరో ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులను కలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. పది వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని సమాలోచన చేస్తున్నది. ఆర్నెల్లలో ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇదే విషయాన్ని ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం ప్రకటించడమే అందుకు నిదర్శనం.
పదోన్నతులతో మరిన్ని ఖాళీలు
రాష్ట్రంలో 9,370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ గతంలోనే గుర్తించింది. వాటిలో 5,089 పోస్టుల భర్తీకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులను గత ప్రభుత్వమే మంజూరు చేసింది. దీంతో 5,089 ఉపాధ్యాయ పోస్టులకు అదనంగా 1,523 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు జత కావడంతో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య 6,612కు చేరింది. అయితే ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమ య్యాయి. దీంతో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే ప్రభుత్వ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే నోటిఫికేషన్‌ వచ్చింది. కొన్ని జిల్లాల్లో చాలా సబ్జెక్టులకు రిజర్వేషన్ల వారీగా పోస్టులే లేని పరిస్థితి ఉన్నది. దీంతో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే వాటి ద్వారా వచ్చే ఖాళీలను గుర్తించాలని అధికారులను కోరినట్టు తెలిసింది. వాటిని కలిపి పది వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీకి కసరత్తు చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ దిశగా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది.

Spread the love