ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో

Metro around ORR– రూ.69వేల కోట్లతో ప్రణాళిక
– మరో కోటి జనాభాకు సరిపడేలా మెట్రో విస్తరణ
– మెట్రోతో శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ
– 415కి.మీ అందుబాటులోకొస్తే ఢిల్లీ మెట్రోను అధిగమించినట్టే :హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
మెట్రో రైలు ఫేజ్‌-3 ప్రాజెక్టులో భాగంగా రూ.69,100 కోట్ల అంచనాతో 309 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ఓఆర్‌ఆర్‌ చుట్టూ విస్తరిస్తామని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇందులో ఓఆర్‌ఆర్‌ చుట్టూ నాలుగు మెట్రో కారిడార్లు, శివారు ప్రాంతాలకు చేరేలా 8 మెట్రో కారిడార్లు ఉంటాయని వివరించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రోను విస్తరించడంతోపాటు మరో కోటి జనాభా రవాణాకు సరిపోయేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మెట్రో విస్తరణకు సంబంధించి తాజాగా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విస్తరణకు సంబంధించిన వివరాలను మంగళవారం హైదరాబాద్‌ బేగంపేట్‌లోని మెట్రో రైల్‌ భవన్‌లో ఎండీ మీడియాకు వివరించారు.
మెట్రో ఫస్ట్‌ ఫేజ్‌లో భాగంగా 69 కిలోమీటర్లలో మెట్రో కొనసాగుతుండగా, సెకండ్‌ ఫేజ్‌లో రాయదుర్గం-ఎయిర్‌పోర్టు, బీహెచ్‌ఈఎల్‌-లక్డికాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌, ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమాకు మొత్తం 67.5 కిలోమీటర్ల మేరకు 42 స్టేషన్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇందులో రాయదుర్గ్‌ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుండగా, బీహెచ్‌ఈఎల్‌-లక్డికాపూల్‌, నాగోల్‌-ఎల్బీనగర్‌ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వెంచర్‌గా రూ.9100 కోట్లతో నిర్మించున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలో అన్ని వివరాలూ తెలియజేస్తామని చెప్పారు.
శివారు ప్రాంతాల మెట్రో కనెక్టివిటీ కోసం రూ.39కోట్లు
మెట్రో ఫేజ్‌-3లో రెండు భాగాలుగా పనులు చేయనున్నారు. పార్ట్‌ ‘ఏ’ లో సిటీ నుంచి శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ వచ్చేలా 8 కారిడార్లు.. 142 కిలోమీటర్లు.. 68 స్టేషన్లతో మెట్రో మార్గాన్ని రూ.39,190 కోట్లతో నిర్మించేందుకు ప్రతపాదనలు రెడీ చేశారు. ఇందులో రూ.3,250 కోట్లతో బీహెచ్‌ఈఎల్‌ నుంచి పటాన్‌చెరు ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా ఇస్నాపూర్‌ వరకు 13 కిలోమీటర్లు, రూ.3250 కోట్లతో ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌- పెద్ద అంబర్‌పేట్‌ వరకు 13 కిలోమీటర్లు నిర్మించనున్నారు. రూ.6800 కోట్లతో శంషాబాద్‌-కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు 28 కిలోమీటర్లు, రూ.6,900 కోట్లతో ఉప్పల్‌ ఔటర్‌రింగ్‌ రోడ్‌- ఘట్‌కేసర్‌-బీబీనగర్‌ వరకు 25 కిలోమీటర్లు, రూ.6,600 కోట్లతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌, మహేశ్వరం మీదుగా కందుకూరు వరకు 26 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.2300 కోట్లతో తార్నాక నుంచి ఈసీఐఎల్‌ వరకు 8 కిలోమీటర్లు, రూ.5,690 కోట్లతో జేబీఎస్‌ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మార్గంలో డబుల్‌ ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌, రూ.4400 కోట్లతో పారడైజ్‌ మెట్రో స్టేషన్‌ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్ల మేరకు డబుల్‌ ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ నిర్మించేందుకు ప్రతిపాదించారు.
136కి.మీటర్ల మెట్రో నిర్మాణం
ఫేజ్‌-3 పార్టు ‘బీ’లో భాగంగా ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో వచ్చేలా రూ.20,810 కోట్లతో 136కిలో మీటర్లతో 13 స్టేషన్లతో మెట్రో కారిడార్‌ నిర్మించనున్నారు. ఇందులో రూ.5,600 కోట్లతో 40 కిలోమీటర్ల.. 5 స్టేషన్లతో ఓఆర్‌ఆర్‌ శంషాబాద్‌ ఎన్‌హెచ్‌-44 నుంచి తక్కుగూడ, బొంగుళూర్‌, పెద్ద అంబర్‌పేట్‌ ఎన్‌హెచ్‌-65 వరకు ఒక కారిడార్‌ నిర్మించనున్నారు. రూ.6,750 కోట్లతో ఓఆర్‌ఆర్‌ పెద్ద అంబర్‌పేట్‌ ఎన్‌హెచ్‌-65 నుంచి ఘట్‌కేసర్‌, శామీర్‌పేట్‌, మేడ్చల్‌ ఎన్‌హెచ్‌-44 వరకు మరో కారిడార్‌, రూ.4785 కోట్లతో 45కిలోమీటర్లు 5 స్టేషన్లతో ఓఆర్‌ఆర్‌ మేడ్చల్‌ ఎన్‌హెచ్‌-44 నుంచి దుండిగల్‌, పటాన్‌ చెరు ఎన్‌హెచ్‌-45 వరకు మూడో కారిడార్‌ ఉండగా, రూ.3,675 కోట్లతో 22కిలోమీటర్ల మేరకు 3 స్టేషన్లతో ఓఆర్‌ఆర్‌ ఎన్‌హెచ్‌-65 నుంచి కోకాపేట్‌, నార్సింగి వరకు నాలుగో కారిడార్‌ నిర్మించనున్నారు. అయితే, ఈ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందని, నిధులు సమీకరణకు సంబంధించిన దానిపై మెట్రో రైల్‌ ఎండీ క్లారిటీ ఇవ్వలేదు.
ఫేజ్‌-3 ఓఆర్‌ఆర్‌ మెట్రో కారిడార్స్‌..
– శంషాబాద్‌ పెద్దఅంబర్‌పేట 40కి.మీ
– పెద్దఅంబర్‌పేట మేడ్చల్‌ 45కి.మీ
– మేడ్చల్‌ పటాన్‌చెరు 29కి.మీ
– పటాన్‌చెరు నార్సింగి 22కి.మీ
మొత్తం: 136కి.మీ..84 స్టేషన్లు.. అంచనా వ్యయం రూ.20,810కోట్లు (మార్పులు చేర్పులు ఉంటాయి.)

ఫేజ్‌-3 మెట్రో ఎక్స్‌టెన్షన్‌ కారిడార్స్‌
– బీహెచ్‌ఈఎల్‌ ఇస్నాపూర్‌ 13కి.మీ
– ఎల్బీనగర్‌ పెద్దఅంబర్‌పేట 13కి.మీ
– శంషాబాద్‌ షాద్‌నగర్‌ 28కి.మీ
– ఉప్పల్‌ బీబీనగర్‌ 25కి.మీ
– శ.ఎయిర్‌పోర్టు కందుకూరు 26కి.మీ
– తార్నాక ఈసీఐఎల్‌ 8కి.మీ
– జేబీఎస్‌ తూంకుంట 17కి.మీ
– ప్యారడైస్‌ కండ్లకోయ 12కి.మీ
మొత్తం: 142 కి.మీ..68 మెట్రో స్టేషన్లు..అంచనా వ్యయం రూ.39.190 కోట్లు.

ఫేజ్‌-2 మెట్రో
బీహెచ్‌ఈఎల్‌ లక్డికాపూల్‌ 26కి.మీ
నాగోల్‌ ఎల్బీనగర్‌ 5కి.మీ
మొత్తం: 31 కి.మీ..28 స్టేషన్లు..ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9100 కోట్లు

మొత్తం : 309 కి.మీ..112 స్టేషన్లు..
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.69,100 కోట్లు(మార్పులు చేర్పులు ఉంటాయి)

ఫేజ్‌-2 మెట్రో
రాయదుర్గ్‌ శ.ఎయిర్‌పోర్టు 31 కి.మీ
ఎంజీబీఎస్‌ ఫలక్‌నూమా 5.5కి.మీ
మొత్తం 36.5కి.మీ..14 స్టేషన్లు.. (-)

ప్రస్తుతం పూర్తయిన ఫేజ్‌-1 మెట్రో..
మియాపూర్‌ ఎల్బీనగర్‌ 29కి.మీ
జేబీఎస్‌ ఎంజీబీఎస్‌ 11కి.మీ
నాగోల్‌ రాయదుర్గ్‌ 29కి.మీ
మొత్తం 69కి.మీ ..60 స్టేషన్లు.. (-)
మొత్తం ఫేజ్‌ల వారీగా మెట్రో కిలోమీటర్లు.. 69(ఫే-1)+67.5(ఫే-2)+142(ఫే-3(ఏ)+136(ఫే-3బి) = 415 కి.మీ… 186 మెట్రో స్టేషన్లు..

Spread the love