ఓల్డ్‌సిటీకి మెట్రో రైలు..

– సన్నాహక పనులు ప్రారంభించిన హెచ్‌ఎంఆర్‌ఎల్‌
– నెలరోజుల్లో భూ సేకరణకు నోటీసులు జారీ
– ఎంజీబీఎస్‌ టూ ఫలక్‌నుమా రూట్లో 5స్టేషన్లు : హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాతబస్తీకి మెట్రో రైలు త్వరలోనే పరుగులు పెట్టనున్నది. ఈ పనులకు సంబంధించిన కసరత్తుని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ మొదలుపెట్టనున్నట్టు, నెలరోజుల్లో భూసేకర ణకు సంబంధించిన నోటీసులు జారీ చేయనున్నామని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి అదివారం వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశాలమేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు సన్నాహక పనులను షురూ చేసినట్టు తెలిపారు. పాత నగరంలో 5.5కి.మీ బ్యాలెన్స్‌ మెట్రో అలైన్‌మెంట్‌ ఎంజీబీఎస్‌ నుంచి దారుల్షిఫా జంక్షన్‌- పురానీ హవేలీ – ఇత్తెబార్‌ చౌక్‌ – అలీజాకోట్ల – మీర్‌ మోమిన్‌ దైరా – హరిబౌలి – శాలిబండ – శంషీర్‌గంజ్‌, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఉంటుందని తెలిపారు. మెట్రో రైలు మార్గంలో 5స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉండగా.. వీటిలో సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషీర్‌గంజ్‌, ఫలక్‌నుమా ఉండనున్నాయన్నారు.
మెట్రో స్టేషన్లు సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌లకు 500మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ రెండు స్టేషన్‌లకు నగరంలో ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా వాటి పేరు పెట్టడం జరిగిందని తెలిపారు. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా 5.5 కిలోమీటర్ల మెట్రోరైలు మార్గంలో 21 మసీదులు, 12 దేవాలయాలు, 12 అషూర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశానవాటికలు, 6 చిల్లాలతో సహా మొత్తం 103 మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలున్నాయని తెలిపారు.
కర్వేచర్‌ సర్దుబాటు, వయాడక్ట్‌ డిజైన్‌, ఎత్తులు, మెట్రో పిల్లర్‌ లొకేషన్‌లలో తగిన మార్పు.. మొదలైన ఇంజనీరింగ్‌ పరిష్కారాల ద్వారా.. నాలుగు తప్ప మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలు పరిరక్షిస్తామని చెప్పారు. మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను కాపాడేందుకు, రోడ్డు విస్తరణ 80 అడుగులకు పరిమితం చేయబడుతుందని, మొదటి ఫేజ్‌ ప్రాజెక్ట్‌ నుంచి అనుభవాల దృష్ట్యా స్టేషన్‌ స్థానాల్లో మాత్రం రహదారిని 120 అడుగులకు విస్తరిస్తారు. ఇక విస్తరణలో ఎఫెక్ట్‌ అయ్యే దాదాపు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించినట్టు తెలిపారు.

Spread the love