కనీస వేతనాల జీవోలను గెజిట్‌ చేయాలి

Minimum wages Animals should be gazetted– లేకుంటే కేసీఆర్‌కు కోటి మంది కార్మికులు బుద్ధి చెబుతారు
– యాజమాన్యాలకు లాభాల కోసం కార్మికుల పొట్టగొట్టడం సరిగాదు
– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
– రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నిరసన దీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కనీస వేతనాలకు సంబంధించిన జీవో నెంబర్‌ 21,22,23,24,25లను వెంటనే గెజిట్‌ చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో తమ ఓటు ద్వారా కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు కోటి మంది కార్మికులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తున్నదని ప్రశ్నించారు. కేంద్రం మీద కేసీఆర్‌ నిజంగా కొట్లాడే వాడై అయితే కార్మికులకు న్యాయం చేసే జీవోల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని కార్మిక శాఖ కార్యాలయం(అంజయ్య భవన్‌) ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ..కేంద్రం విధానాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోయిందనీ, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయని వాపోయారు. యూరప్‌, చైనా, తదితర దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు కార్మికుల వేతనాలను పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల చేతుల్లో డబ్బు తిరుగుతూ ఉంటే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందనీ, అదే డబ్బు పెట్టుబడిదారుల చేతుల్లో బందీ అయితే ఏం ప్రయోజనం ఉండదని వివరించారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తదితర రాష్ట్రాల్లో కనీస వేతనాలు అమలవుతున్నాయన్నారు.
ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉద్యోగులకు రెండు సార్లు జీతాలు పెరిగాయనీ, అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సీఎం తమ వేతనాలనూ పెంచుకున్నారని చెప్పారు. పదేండ్ల కాలంలో కార్మికులు ఏం పాపం చేశారని పెంచలేదని ప్రశ్నించారు. కనీస వేతనాలు సవరించకుండా కార్మికులను కడు పేదరికంలోకి నెట్టివేస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం మాట్లాడుతూ..అరకొర వేతనాలిస్తూ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామని సీఎం కేసీఆర్‌ గొప్పలు చెప్పడం సరిగాదన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా జీవన ప్రమాణాలుంటాయనీ, దానికి తగ్గట్టు ఖర్చులుంటాయని పలు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్న ధరలను పోల్చుతూ వివరించారు. యజమానులకు అధిక లాభాలు దక్కేలా పాలకులు కొమ్ము కాస్తూ కార్మికుల పొట్ట గొట్టడం సబబు కాదన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ..నిత్యావసరాల ధరలు, ఇంటి అద్దెలు, ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో వెంటనే కనీస వేతనాల జీవోలను గెజిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. చట్టం ప్రకారం ఐదేండ్లకోసారి వేతనాలు సవరించాల్సి ఉండగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆ పని చేయలేదని విమర్శించారు.
కనీస వేతనాల బోర్డు సభ్యులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ..2021 జూన్‌లో ఐదు రంగాలకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారనీ, వాటిలో అన్‌స్కిల్డ్‌ వర్కర్‌కు మినిమం బేసిక్‌ రూ. 18,019, వీడీఏ రేటు రూ. 12 నిర్ణయించారని తెలిపారు. ఆ తర్వాత సెమీస్కిల్డ్‌, స్కిల్డ్‌, హైలీ స్కిల్డ్‌ కార్మికులకు వేతనాలు పెంచాలనే తీర్మానం జరిగిందన్నారు. కానీ, గెజిట్‌ చేయలేదన్నారు. యాజమాన్య సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తే ఆ మీటింగ్‌లో అన్ని కార్మిక సంఘాలు ఏకాభిప్రాయంతో ఐదు ఫైనల్‌ నోటిఫికేషన్లను గెజిట్‌ చేయాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. కనీస వేతనాల సలహా మండలి సూచనలను పెడచెవిన పెట్టడం సరిగాదన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏసురత్నం(ఏఐటీయూసీ), రెబ్బారామారావు(హెచ్‌ఎంఎస్‌), ఎంకే.బోసు(టీఎన్‌టీయూసీ), సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. మల్లేశం, జె. చంద్రశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శులు బి. మధు, కూరపాటి రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love