ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వానికి మిల్లర్లు సహకరించాలి : మంత్రి గంగుల

నవతెలంగాణ – హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మిల్లర్లను కోరారు. గురువారం సచివాలయంలో మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్ నూక శాతం తదితర వాటిపై ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఎఫ్.ఏ.క్యూ ధాన్యంలో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా మిల్లర్లు సహకరించాలన్నారు. ధాన్యం అన్‌లోడింగ్‌ వెంటనే చేపట్టాలన్నారు. సీఎంఆర్ నిర్ణీత గడువులోగా ముగించాలని సూచించారు. యాసంగి ధాన్యంలో నూక శాతంపై గతంలో ఇచ్చిన నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించుకోవాలో సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు మిల్లర్లు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, జీఎం శ్రీనివాసరావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీ ఏ.సుధాకర్ రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. ప్రభాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.

Spread the love